క్యారెక్టర్ ఏదైనా సరే తనదైన నటనతో పాత్రకు ప్రాణం పోయగల అతికొద్ది మంది తెలుగు నటుల్లో అజయ్ ఒకరు. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి సపోర్టింగ్ రోల్స్ మొదలుకొని విలన్ క్యారెక్టర్స్ వరకూ అన్ని పాత్రల్లోనూ మెప్పించిన నటుడు అజయ్. “విక్రమార్కుడు”లో వీరలెవల్లో విలనిజం పండిచడమైనా, “ఆర్య 2″లో విలనిజంతో కామెడీని కలగలిపి నవ్వించడమైనా, “ఇష్క్” సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాజిటివ్ బ్రదర్ క్యారెక్టర్ లో సెంటిమెంట్ పండించడం అయినా, ఇటీవల విడుదలైన “సుబ్రమణ్యం ఫర్ సేల్”లో చదువుకోని మాఫియా డాన్ గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమైనా కేవలం అజయ్ కే సాధ్యపడింది.
తాజాగా.. తమిళ-తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైంటిఫిక్ థ్రిల్లర్ “24”లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు. “ఇష్క్”లో అజయ్ నటనకు ఫిదా అయిపోయిన దర్శకుడు విక్రమ్ కుమార్ “24” సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం అజయ్ ను ఏరికోరి ఎంపిక చేసుకొన్నాడు. సినిమా మొత్తం దాదాపుగా సూర్యతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ లో అజయ్ కనిపించనున్నాడు.
“24” చిత్రం తనకు నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తీసుకురావడంతోపాటు.. ఆత్మా సంతృప్తినిచ్చే చిత్రమని అజయ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు!