సినిమా అంటేనే ఒక రకమైన జూదం. అదృష్టం ఉన్నోడికి పట్టిందల్లా బంగారం అవుతుంది. దరిద్రం తోడున్నోడికి బంగారమే బూడిదగా మారిపోతుంది. అసలు విషయానికి వస్తే ఒకప్పుడు సినిమా సేల్ కావాలి అంటే సినిమా కధ, కధనం అన్నీ తెలిస్తే కానీ కోనేవారు కాదు, అసలు ఒకానొక సమయంలో అయితే సినిమా నిర్మాతలే సినిమాను స్వయంగా విడుదల చేసిన కాలం నడిచింది. ఆ కాలం నుంచి బయ్యర్స్ కాలం వరకూ సినీ పరిశ్రమ మారింది. ఇప్పటి ట్రెండ్ తీసుకుంటే సినిమా క్ల్యాప్ కొట్టి ముహూర్తం షాట్ అవ్వగానే సినిమా బిజినెస్ అయిపోతుంది. కొంత మంది హీరోల విషయానికి వస్తే ఒక హిట్ డైరెక్టర్ తో సినిమా అనగానే ఆ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోవడం నమ్మలేని నిజం అయినప్పటికీ నమ్మక తప్పదు. బడా హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, మహేష్, అల్లు అర్జున్ ఇలా ఈ యువ హీరోల సినిమా విషయాన్నే తీసుకుంటే ఒక బడా దర్శకుడితో సినిమా వస్తుంది అంటే చాలు, వార్త వినపడగానే బయ్యర్స్, డిస్ట్రీబుటేర్స్ ఇలా అందరూ క్యూ కట్టి మరీ సినిమాను సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. తాజాగా వచ్చిన సినిమాల సంగతే తీసుకుంటే పవన్ కల్యాణ్ సర్దార్ సినిమా ఇంకా పూర్తి కాకుండానే ఈ చిత్రం బిజినెస్ భారీగా జరగడంతో నిర్మాత ఫుల్ ఖుషీగా ఉన్నాడు. దాదాపుగా 90కోట్ల ప్రీ..బిజినెస్ జరిగింది అంటూ వార్తలు బయట పడుతున్నాయి. ఇక మరో పక్క ఎన్టీఆర్-కొరటాల “జనతా గ్యారేజ్” కూడా 75కోట్ల ప్రీ..బిజినెస్ అయిపోయి నిర్మాతకి పండగ వాతావరణం నెలకొల్పింది. ఇలా బడా హీరోలు- బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుల కాంబినేషన్స్ నిర్మాతలకు కాసుల పంట పండిస్తూ ఉండడం హర్షించ దగ్గ విషయమే.