యువకళావాహిని ఆధ్వర్యంలో ‘బిచ్చగాడు’ విజయాభినందన సభ

  • June 30, 2016 / 08:24 AM IST

తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ ఆంటోని, సత్న టైటస్‌ జంటగా ఫాతిమా ఆంటోని నిర్మించిన చిత్రం ‘పిచ్చైకారన్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో చదలవాడ తిరుపతిరావు సమర్పణలో మే 13న విడుదల చేశారు. రిలీజైనప్పటి నుంచి హిట్‌టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతూ 50 రోజులను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా బుధవారం యువ కళావాహిని ఆధ్వర్యంలో విజయాభినందన సభను ఏర్పాటుచేశారు.

సమర్పకుడు చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ – ”చాలా సంవత్సరాల తర్వాత మా బ్యానర్‌లో ఇలాంటి ఓ మంచి సినిమా వచ్చి ఇంత పెద్ద సక్సెస్‌ కావడం హ్యాపీగా వుంది. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణగా నిలిచింది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.

సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ – ”బిచ్చగాడు’లాంటి చిత్రాన్ని చూస్తే సొసైటీ కొంతైనా బాగుపడుతుంది. తల్లి ప్రేమకోసం కొడుకు పడే తపన కలచివేస్తుంది. ఎడిటింగ్‌ అద్భుతంగా ఉంది. ఇలాంటి చిత్రాన్ని తీసిన నిర్మాతను అభినందిస్తున్నాను” అన్నారు.

జె. బాపురెడ్డి మాట్లాడుతూ – ”గొప్ప అనుభూతితో పాటు గొప్ప మెసేజ్‌ ఇచ్చిన సినిమా ‘బిచ్చగాడు’. ఈ పాత్ర చిరస్ధాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి మంచి చిత్రాలు స్ఫూర్తిగా నిలిచిపోతాయి” అన్నారు.
జి.సత్యవాణి మాట్లాడుతూ – ”సినిమా అద్భుతంగా ఉంది. ‘శంకరాభరణం’ తర్వాత ఒక మంచి సినిమా చూశాననే తృప్తి కలిగింది. అన్ని కోణాల్లో మంచి సందేశం ఉన్న సినిమా ఇది” అన్నారు.

హరినాధరావు మాట్లాడుతూ – ”బిచ్చగాడు’ అనువాద చిత్రమైనప్పటికీ చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు పంథాలో ఉండి అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది . అమ్మ కోసం బిడ్డ పడే తపనను తెలియచేసే ఈ చిత్రం వంద రోజుల వేడుక జరుపుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ – ”మానవ సంబంధాలను సమాజంలో వ్యక్తి బాధ్యతలను తెలియచేసే చిత్రమిది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అన్నారు.

జీడిగుంట రామచంద్ర మాట్లాడుతూ – ”సునిశితమైన మెసేజ్‌ ఉన్న చిత్రమిది. అన్ని పాత్రలు కథకు తగ్గట్టుగా సరిపోయాయి. ప్రతి సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి” అన్నారు.

శరత్‌జ్యోత్స్న మాట్లాడుతూ – ”వైవిద్యభరితమైన కథను సినిమాగా మలిచారు. సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు” అన్నారు.

కె.బి. లక్ష్మి మాట్లాడుతూ – ”సైంటిఫిక్‌గా ఆలోచించి అందరి సందేహాలను తీర్చే సినిమా ఇది. ఇలాంటి సినిమాను తీసిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను” అన్నారు.

శోభ మాట్లాడుతూ – ”మూడు వందల మందిలో ఒక వ్యక్తి బిచ్చగాడుగా మారిపోతున్నాడని ఒక సర్వే చెబుతోంది. అందుకు కారణాలు అనేకం. మంచి సామాజిక స్పృహ ఉన్న చిత్రమిది. మానవీయ కోణంలో తెరకెక్కించిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను” అన్నారు.

సత్య మాట్లాడుతూ – ”తెలుగు ప్రేక్షకులు సినిమాని ఇంతగా ఆదరిస్తారని ఊహించలేదు. మంచి చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనడానికి ఇదొక ఉదాహరణ” అన్నారు.

సుధామ మాట్లాడుతూ – ”తమిళ చిత్రమైనా తమిళ వాసన ఎక్కడా లేకుండా తెలుగు నేటివిటీకి తగిన విధంగా అద్భుతంగా తెరకెక్కించారు. భాషాశ్రీ అద్భుతమైన డైలాగ్స్‌ను రాశారు” అన్నారు.

కె.వి. కృష్ణకుమారి మాట్లాడుతూ – ”ప్రతి ఫ్యామిలీలో అందరూ చూడదగ్గ చిత్రం. మానవీయ సంబంధాలు దూరమైపోతున్న ఈరోజుల్లో వాటిని మనకు గుర్తుతెచ్చేలా దర్శక నిర్మాతలు అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారు. వారి నిజమైన ప్రయత్నమే ఇప్పుడు సక్సెస్‌ రూపంలో నిలిచింది” అన్నారు. చిత్ర నిర్మాతలు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు శాలువాలతో సత్కరించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus