పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే ఆయన అభిమానులకు పండుగే. ఇక ఈ మధ్య పవన్ నటిస్తున్న ప్రతీ సినిమా భారీ హిట్స్ సాధిస్తూ కలెక్షన్స్ లో ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. అయితే గతంలో విడుదలయిన పవన్ ‘గబ్బర్ సింగ్’ ఎంత భారీ హిట్ కొట్టి, ఇండస్ట్రీ ని షేక్ చేసిందని అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సర్దార్ గబ్బర్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందులో భాగంగా ఆ చిత్రాన్ని భారీగా అమ్మేసారు సినిమా నిర్మాతలు. ఒక్క నైజామ్ ఏరియా మినహా మిగిలిన వన్నీ ఎరొస్ సంస్థ భారీ అమౌంట్ ఇచ్చి మరీ సినిమా రైట్స్ దక్కించుకుంది. ఇక నైజామ్ విషయానికి వస్తే అక్కడ ఈ సినిమా రైట్స్ కోసం ఎంతో మంది ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడినప్పటికీ అవకాశం మాత్రం ‘ఇంద్ర’ సంస్థ వారికి దక్కింది. అందరినీ తలదన్ని దాదాపుగా 20కోట్ల రూపాయలకు ఈ రైట్స్ కొట్టేసారు ఆ సంస్థ వారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు విషయం కొంచెం తేడాగా ఉంది, అదేమిటంటే భారీగా పెట్టుబడి పెట్టి ఈ సినిమాను కొన్నాం అని గొప్పలకు పోయి, డప్పులు కొట్టుకుంటున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఎంత భారీ హిట్ అయినా నైజామ్ కెప్యాసిటీ 17కోట్లు దాటదు అని, మరి 20కోట్లు పెట్టి కొన్న ఇంద్ర సంస్థ వారికి లాభాల మాట పక్కన పెడితే పెట్టిన పెట్టుబడి రావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ 17కోట్ల లెక్క సినిమా భారీ హిట్ అయితే, ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఇంద్ర సంస్థకు భారీ నష్టాన్నే చేకూరుస్తుంది అని ట్రేడ్ పండితుల అంచనా. చూద్దాం మరి ఏం జరగబోతుందో.