Ramesh Varma: ఖిలాడీ విమర్శలకు అలా చెక్ పెట్టిన డైరెక్టర్!
February 14, 2022 / 11:10 PM IST
|Follow Us
బెల్లంకొండ శ్రీనివాస్ తో తెరకెక్కించిన రాక్షసుడు సినిమా సక్సెస్ తో రమేష్ వర్మ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడంతో ఆయనకు ఖిలాడి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. రవితేజ హీరోగా 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రమేష్ వర్మ ఖిలాడీ సినిమాను తెరకెక్కించగా క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాకు పోటీగా విడుదలైన డీజే టిల్లు సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో రికార్డు స్థాయిలో కలెక్షన్లను అందుకుంటోంది.
ఖిలాడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ రమేష్ వర్మపై పరోక్షంగా సెటైర్లు వేయడం ఆ తర్వాత రమేష్ వర్మ భార్య రవితేజను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గురించి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఖిలాడీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో రవితేజ, రమేష్ వర్మ మధ్య ఉన్న విభేదాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. భారీ మొత్తం పెట్టుబడి పెట్టి ఖిలాడీ హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఖిలాడీ ఫ్లాప్ విషయంలో కొంతమంది రవితేజను నిందిస్తుంటే మరి కొందరు డైరెక్టర్ రమేష్ వర్మదే తప్పని నిందిస్తున్నారు. అయితే రమేష్ వర్మ ఖిలాడీ రిజల్ట్ గురించి స్పందిస్తూ ఆసకికర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ కొరకు ఖిలాడీ సినిమాను తెరకెక్కించామని వాళ్లకు ఈ సినిమా నచ్చిందని ఈ సినిమా రిజల్ట్ విషయంలో కామన్ ఆడియన్స్ కూడా హ్యాపీ అని ప్రొడ్యూసర్ కూడా ఖిలాడీ విషయంలో సంతోషం వ్యక్తం చేశారని రమేష్ వర్మ తెలిపారు.
ఖిలాడీ ప్రొడ్యూసర్ తనకు 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ను అప్పగించారని రమేష్ వర్మ అన్నారు. అయితే 100 కోట్ల ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఖిలాడీ రిజల్ట్ వల్ల రమేష్ వర్మకు కొత్త సినిమా ఆఫర్లు రావడం తేలిక కాదని ప్రచారం జరుగుతున్న తరుణంలో తనకు 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని రమేష్ వర్మ వెల్లడించడం గమనార్హం. అదే సమయంలో ఖిలాడీ నార్మల్ ఆడియన్స్ కు నచ్చిందంటూ రమేష్ వర్మ విమర్శలకు చెక్ పెట్టారు.