10th Class Diaries Review: 10th క్లాస్ డైరీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
July 1, 2022 / 01:45 PM IST
|Follow Us
తెలుగు ప్రేక్షకులకి శ్రీరామ్ గా సుపరిచితమైన తమిళ యాక్టర్ శ్రీకాంత్.. ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో ’10th క్లాస్ డైరీస్’ కూడా ఒకటి..! నిజానికి ఇది ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ. టి.ఎన్.ఆర్ ట్రైలర్ లో కనిపించిన్నప్పుడే ఈ విషయం అందరికీ అర్ధమై ఉండాలి. అయితే సరైన రిలీజ్ డేట్ దొరక్క ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో ఒకరైన అవికా గోర్ నటించడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ మూవీ. టీజర్, ట్రైలర్ వంటివి చూస్తే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అనే ఆశలు కలిగించింది. మరి ఈ ’10th క్లాస్ డైరీస్’ ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : బాగా చదువుకుని అమెరికాలో స్థిరపడిన సోమయాజులు అలియాస్ సోము(శ్రీరామ్)కి అన్ని రకాల సుఖాలు ఉంటాయి. డబ్బు, లగ్జరీ, అమ్మాయిలు ఇలా దేనికీ లోటు ఉండదు.అలాగే అతనికి పెళ్లై భార్య కూడా ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల అతనికి జీవితంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో అతని భార్య ను కూడా వదిలేసి.. తన ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో తన ఆనందం మొత్తం తన చిన్నప్పటి స్కూల్ మేట్, ఫస్ట్ లవ్ అయిన చాందిని(అవికా గోర్) దగ్గర ఉందని తెలుసుకుని..
ఆమెను కలుసుకుని దగ్గరవ్వాలని… వెంటనే ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చేస్తాడు.అప్పుడు కావాలని స్కూల్ లో రీయూనియన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాడు.దానికి అందరూ వస్తారు కానీ చాందినీ రాదు? ఆమె ఎందుకు రాలేదు? ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఆమె ఎక్కడ ఉంది? ఆమెను కలుసుకోవడానికి తన స్కూల్ ఫ్రెండ్స్ ఎలా సాయపడ్డారు అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : స్క్రీన్ అప్పీరెన్స్ పరంగా చూసుకుంటే శ్రీరామ్ ఈ పాత్రకి కరెక్ట్ గా సరిపోయాడు. ఎన్నారై గా, తన చిన్నప్పటి లవర్ కోసం పరితపించే యువకుడు గా శ్రీరామ్ కరెక్ట్ గా సరిపోయాడు. అవికా గోర్ కూడా చాలా బాగా చేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె మంచి నటన కనపరిచింది. కానీ శ్రీరామ్ – అవికా పెయిర్, వారి మధ్య కెమిస్ట్రీ చూడడానికి కష్టంగా అనిపిస్తుంది.
ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్న సంగతి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి క్లియర్ గా తెలుస్తుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి, అచ్యుత రామారావు పాత్రలు కొంత ఫన్ జెనరేట్ చేయడానికి ఉపయోగ పడ్డాయి. వాళ్ళ కామెడీ కొంత రిలీఫ్ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. హిమజ, వేద, శివ బాలాజీ, వెన్నెల రామారావు, నాజర్ వంటి నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : నిర్మాత వెన్నెల రామారావు జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడిగా మారారు. తొలి చిత్ర దర్శకుడు అయినప్పటికి అనుభవం ఉన్న డైరెక్టర్గా డీల్ చేయడంలో అంజి సఫలమయ్యారు. అయితే ఈ ఇన్సిడెంట్స్ చెప్పగానే దర్శకుడు ‘ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ ‘స్నేహితుడు'(3 ఇడియట్స్) ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ‘జాను'(96) వంటి సినిమాలు చూసి స్క్రీన్ ప్లే రాసుకున్నాడా?’ అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఎందుకంటే ఈ చిత్రంలో అడుగడుగునా ఆ సినిమాల రిఫరెన్స్ లు కనిపిస్తాయి. ప్రియుడి నిర్లక్ష్యం,తండ్రి అతి జాగ్రత్త.. వల్ల ఓ అమ్మాయి జీవితం ఏమైపోయింది? అనే ఈ చిత్రం మెయిన్ పాయింట్. మంచి మెసేజ్ గా అనిపించే పాయింట్ కూడా అదే. కానీ పాత సినిమాల పోలికల వల్ల ఆ పాయింట్ డైవర్ట్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు అంజి.. టేకింగ్ తో ఎలా ఉన్న సినిమాటోగ్రాఫర్ గా అయితే న్యాయం చేశాడు.
చిక్ మంగళూరు వంటి లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని అందంగా చిత్రీకరించాడు. సురేష్ బొబ్బిలి అందించిన నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కి ఇంకాస్త పని పెట్టాలి అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు బాగానే ఉన్నాయి. నిడివి 2 గంటల 22 నిమిషాలు మాత్రమే ఉండడం కూడా ఓ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.
విశ్లేషణ : ’10th క్లాస్ డైరీస్’ లో మంచి పాయింట్ ఉంది. ఆ పాయింట్ కు కనెక్ట్ అవ్వడం వలన సినిమాని పూర్తిగా చూడగలుగుతాం. కానీ స్క్రీన్ ప్లే కొత్తగా.. ఎంగేజ్ చేసే విధంగా ఉంటే బాగుండేది. ఇందులో అదే లోపించింది.