ఫిబ్రవరి 9 పంచాయితీ తేలింది!… సింగిల్ రిలీజ్ మాట అయితే దక్కలేదు?
January 30, 2024 / 12:03 PM IST
|Follow Us
మొన్నీమధ్యే సంక్రాంతి సీజన్లో ఐదు సినిమాలు బరిలో నిలిచినప్పుడు ఒక సినిమాను తప్పుకోమని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అడిగింది. బరిలో ఉన్న అందరినీ అడిగి, ఒక సినిమా వాళ్లను కాస్త ఎక్కువ అడిగింది. అయితే ఏమైందో ఏమో వాళ్లు వెనక్కి తగ్గలేదు. కానీ ‘ఈగల్’ వెనక్కి వెళ్లాడు. అయతే ఆ రోజు ఆ సినిమాకు ఇచ్చిన ‘సింగిల్ రిలీజ్’ మాట సాకారం అవ్వలేదు. అంటే ఫిబ్రవరి 9న ‘ఈగల్’ సింగిల్ రావడం లేదు.
రవితేజ – కార్తిక్ ఘట్టమనేని – పీపుల్ మీడియా కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఈగల్’. ఈ సినిమాను పొంగల్ ఫైట్ నుండి తప్పించి ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ నిర్ణయించింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తరఫున అధ్యక్షుడు దిల్ రాజు ఈ మేరకు సింగిల్ రిలీజ్ మాటిచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఆ డేట్ను మరికొన్ని సినిమాలు ప్రకటించాయి. ‘యాత్ర 2’, ‘ఊరు పేరు భైరవకోన’, ‘లాల్ సలామ్’ విడుదలకు సిద్ధమయ్యాయి.
దీంతో ఫిబ్రవరి 9 పంచాయితీ మొదలైంది. దీని మీద మరోసారి మండలి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మొదలైంది. ఈ క్రమంలో మండలి పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చేశారు. ‘ఈగల్’ సినిమా సింగిల్ వచ్చే పరిస్థితి లేదని, అయితే ఓ సినిమా మాత్రం ఆ డేట్ ఫైట్ నుండి తప్పుకుంది అని చెప్పారు. చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఊరు పేరు భైరవకోన’ మరో వారం వాయిదా వేశారు. ఈ మేరకు నిర్మాత రాజేష్ దండా ఒప్పుకున్నట్లు దిల్ రాజు ప్రకటించారు.
రాజకీయ కారణాల దృష్ట్యా ‘యాత్ర 2’ సినిమాను వాయిదా వేయడానికి నిర్మాతలు ఒప్పుకోలేదని చెప్పారు. ఇక రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన ‘లాల్ సలామ్’ ఫిబ్రవరి 9నే విడుదల అవుతుందని తెలిపారు. అయితే ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి తెలియజేయగా ఇబ్బంది లేదన్నారని దిల్ రాజు చెప్పారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో (Eagle) ‘ఈగల్’ సినిమాకు ఎక్కువ థియేటర్స్ వచ్చేలా చూస్తాం అన్నారు.