Vakeel Saab: అలా అయితే పవన్ కళ్యాణ్ సినిమాకి పెద్ద దెబ్బ పడినట్టే..!
April 3, 2021 / 12:32 PM IST
|Follow Us
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండీ 3 ఏళ్ళ తరువాత రాబోతున్న చిత్రం ‘వకీల్ సాబ్’.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిజానికి గతేడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో అది సాధ్యం కాలేదు. అయితే మొన్నటి వరకూ పరిస్థితి బాగానే ఉంది.. థియేటర్లు తెరుచుకోవడం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా సినిమాలు చూడడానికి వస్తుండడం జరిగింది. దాంతో పెద్ద సినిమాల్లో ముందుగా ‘వకీల్ సాబ్’ ను దించాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. ప్రమోషన్లు కూడా భారీగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల లాక్ డౌన్ పెట్టడానికి రెడీ అయ్యారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వంటి బడా హీరో సినిమా విడుదల చేస్తే కచ్చితంగా పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని భావించి.. 50 శాతం ఆకుపెన్సీతోనే థియేటర్లను రన్ చెయ్యాలని ప్రభుత్వానికి వైద్య శాఖ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఆల్రెడీ కర్ణాటక లో 50 శాతం ఆకుపెన్సీతోనే థియేటర్లను రన్ చెయ్యాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.