కళ్లన్నీ”ఒక మనసు” పైనే

  • June 20, 2016 / 01:54 PM IST

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నటించిన తొలి చిత్రం “ఒక మనసు” ఈ శుక్రవారం (జూన్ 24) విడుదల కానుంది. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు తర్వాత రామ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ప్రధాన బలం నిహారిక. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన తొలి నటి కావడం విశేషం. ఆమె నటనను చూసేందుకు మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిహారిక సినిమాలోకి రాకముందు యాంకర్ గా తెలుగు ప్రజలకు పరిచయమే. అంతేకాదు యూ ట్యూబ్ లో ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ ద్వారా తన కంటూ ప్రత్యేకంగా అభిమానులను ఏర్పరుచుకుంది. ఇందులో తన ఒరిజల్ క్యారక్టర్ కి తగినట్లుగా ఉండే పాత్రను చేసి మెప్పించింది. ఒక మనసు చిత్రంలో హుందాగా, డాక్టర్ సంధ్యగా కనిపించనుంది. టీజర్ లో ఆమెను చూసిన వారందరూ చీర కట్టిన చందమామలా ఉందని అభినందించారు.

ఇక నటనతో ఎంతమంది ప్రశంసలు అందుకోనుందో చూడాలి. నిహారిక తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది నాగ శౌర్య గురించి. ఈ హీరో “ఒక మనసు” చిత్రం కంటే ముందుగానే ఎంతోమంది మనసులను గెలుచుకున్నాడు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి యువ హీరో లలో ఒకడిగా నిలిచాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణ వైభోగమే చిత్రాలతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. తన తాజా చిత్రంలో సూర్యగా పాత్రలో ఇమిడిపోయాడు. తెరపైన నాగశౌర్య, నిహారిక ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు టీజర్ చెప్పకనే చెబుతోంది.

రామ రాజు మరో సారి హాయిగొలిపే ప్రేమ కావ్యాన్ని వెండితెరపై రాసారు. కుటుంబం మొత్తం కలిసి చూసేలా రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఒక కట్ కూడా చెప్పకుండా సెన్సార్ వాళ్లు “యు” సర్టిఫికేట్ అందించారు. రెండు మనసులు మధ్య ఘర్షణను ఎంతో సున్నితంగా చూపించినందుకు సెన్సార్ సభ్యులు రామ రాజును అభినందించినట్లు సమాచారం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ అందించిన సంగీతం యువతకు బాగా నచ్చింది. ఆల్బం మొత్తం మెలోడీ హిట్స్ గా నిలిచాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే సినీ ప్రియుల కళ్లన్నీ ఒక మనసు చిత్రం పై నే ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus