సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్ దళ్ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?
June 11, 2024 / 04:45 PM IST
|Follow Us
సినిమాలు – కాంట్రవర్శీలు.. ఈ రెండింటికీ విడదీయరాని బంధం ఉంది. ప్రతి నెలా ఏదో ఒక సినిమా ఇలా కాంట్రవర్శీలు ఎదుర్కొంటూనే ఉంది. ఒకప్పుడు థియేటర్లు మాత్రమే కీలకం కాబట్టి ఆ సినిమాలకే చర్చలు జరిగేవి, మనోభావాలు దెబ్బతినేవి, వాదనలు వచ్చేవి, వివాదాలు చెలరేగేవి. ఇప్పుడు థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ పారలల్‌గా కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి అక్కడా మొదలైంది ఈ వివాదాల రచ్చ. అలా ఓ స్టార్ హీరో తనయుడి సినిమాకు అందులోనూ తొలి సినిమాకే ఇబ్బంది మొదలైంది.
ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు ఆమీర్ ఖాన్ (Aamir Khan) తనయుడు జునైద్ తొలి చిత్రం ‘మహారాజ్’ ఈ నెల 14న నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కానుంది. ఈ మేరకు పది రోజుల క్రితమే ఘనంగా ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు సినిమాకు మరో మూడు రోజులు ఉంది అనగా.. ఈ సినిమాలో తమ మనోభావాలు దెబ్బతినే విషయాలు ఉన్నాయంటూ భజరంగ్ దళ్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు తమకు ప్రైవేట్ స్క్రీనింగ్ చేశాకే.. ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అల్టిమేటం జారీ చేశాయి.
దీంతో అసలు సినిమా కథేంటి, వివాదం ఏంటి అనే చర్చ మొదలైంది. 1862లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాజ్ లైబిల్ కేసు ఆధారంగా ‘మహారాజ్’ సినిమా తెరకెక్కింది. సిద్దార్థ్.పి.మల్హోత్రా ఈ సినిమాను రూపొందించారు. మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని అమాయక అమ్మాయిల జీవితాలతో ఆడుకునే కొందరి దుర్మార్గాల గురించి ఈ సినిమాలో ప్రస్తావించారు అని సమాచారం.
అప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించి రీసెర్చ్ చేసి ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఇందులో మనోభావాలు అంశం తెరపైకి వచ్చింది. సినిమా విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్నా.. నెట్ ఫ్లిక్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఈ విషయంలో దర్శక నిర్మాతలు సైలెంట్‌గా ఉన్నారు. దీంతో సినిమా ఆ రోజు స్ట్రీమ్ అవుతుందా లేదా అనేది తెలియడం లేదు.