ఆటగదరా శివ

  • July 20, 2018 / 03:15 AM IST

“ఆ నలుగురు, అందరి బంధువయా” లాంటి సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న చంద్ర సిద్ధార్ధ తెరకెక్కించిన తాజా చిత్రం “ఆటగదరా శివ”. దొడ్డన్న, ఉదయ్ శంకర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో విశ్లేషకుల ప్రశంసలు అందుకొన్న “రామ రామ రే” అనే చిత్రానికి రీమేక్. స్టోరీ డ్రివెన్ ఫిలిమ్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకోగలదో చూద్దాం..!!

కథ : సీరియల్ మర్డర్స్ కారణంగా పోలీస్ కష్టడీలో ఉన్న బాబ్జీ (ఉదయ్) అనే నిందితుడికి కోర్ట్ ఉరిశిక్ష విధిస్తుంది. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం జైల్ నుంచి పారిపోతాడు బాబ్జీ. ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమకపడుతుంటే.. దారిలో కలుస్తాడు జంగయ్య (దొడ్డన్న). నిజానికి జంగయ్య జీపులో బయలుదేరిందే బాబ్జీకి పడిన ఉరిశిక్షను అమలు చేయడానికి.. ఎందుకంటే జంగయ్య ఓ తలారి. కానీ.. ఒకరి గురించి ఒకరికి తెలియక ఒకే జీపులో ప్రయాణిస్తుంటారు.

అలా అనుకోకుండా మొదలైన వారి ప్రయాణంలో ప్రేమించి పెళ్ళి చేసుకోవడం కోసం ఊరి నుంచి పారిపోతున్న ఆది-దీప్తిల జంట తారసపడుతుంది. ఈ నలుగురు కలిసి చేసిన ప్రయాణం చివరికి ఏ తీరానికి చేరింది? ఈ ప్రయాణ మార్గంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇంతకీ బాబ్జీకి తలారి జంగయ్య ఉరిశిక్ష వేయగలిగాడా? అనేది “ఆటగదరా శివ” కథ.

నటీనటుల పనితీరు : కన్నడలో సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన దొడ్డన్నకు ఇది మొదటి తెలుగు చిత్రం కావడంతో.. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ తో పాత్రని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేసినా.. చాలా చోట్ల డైలాగ్స్ కి లిప్ సింక్ కుదరలేదు. అలాగే.. ఆయన పాత్రకి కాస్ట్యూమ్స్ పరంగా కంటిన్యుటీ మిస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో ఆయన రెండు కాళ్ళకి పెయిన్ కంట్రోల్ సాక్స్ కనిపిస్తాయి, కొన్ని సన్నివేశాల్లో ఉండవు. అయితే.. ఆయన కళ్ళల్లో నీరసం, బాడీ లాంగ్వేజ్ పాత్ర స్వభావాన్ని ప్రేక్షకులకు సులభంగా అర్ధమయ్యేలా చేస్తుంది.

ఉదయ్ శంకర్ కి తొలి చిత్రం కావడంతో అతడి నటనలో పరిణితి కనిపించదు. ముఖ్యంగా అతడి ముఖంలో కనిపించాల్సిన బాధ ఏ ఒక్క సన్నివేశంలోనూ కనిపించదు. అందువల్ల అతడి పాత్ర వల్ల సినిమాలో క్రియేట్ అవ్వాల్సిన ఎమోషన్, డ్రామా, టెన్షన్ అనేవి సినిమాలో ఎక్కడా కనిపించవు.

హైపర్ ఆది పంచ్ డైలాగులు కొన్ని చోట్ల నవ్వించగా.. అతడి ప్రియురాలిగా నటించిన దీప్తి పాత్రకు తగ్గ అభినయంతో ఆకట్టుకొంది. మిలిటరీ జవాన్ శ్రీధర్ గా సందేశ్ మంచి పాత్రలో మెప్పించాడు. అలాగే.. చలాకీ చంటి, భద్రం తదితరులు నవ్వించడానికి ప్రయత్నించారు. పోలీస్ పాత్రలో “కీచక” ఫేమ్ జ్వాల కోటి కళ్ళతోనే విలనిజాన్ని పండించాడు.

సాంకేతికవర్గం పనితీరు : కన్నడ ఒరిజినల్ వెర్షన్ కు వర్క్ చేసిన సంగీత దర్శకుడు వాసుకి వైభవ్, కెమెరా మెన్ లివిత్ లు తెలుగు వెర్షన్ కు కూడా వర్క్ చేయడం అనేది ఒకరకంగా ప్లస్ అయితే.. ఇంకోరకంగా మైనస్ అయ్యింది. వాసుకి వైభవ్ సంగీతం పరంగా నేటివిటీ మిస్ అవ్వడం మైనస్ అయితే.. నేపధ్య సంగీతంతో ఎమోషన్స్ ని ఎలివేట్ చేయడం ప్లస్ పాయింట్. అదే తరహాలో లివిత్ సినిమాటోగ్రఫీ ఏరియల్ షాట్స్ మరియు లాంగ్ షాట్స్ లో ప్లస్ పాయింట్స్ గా నిలిస్తే.. కలర్ గ్రేడియన్స్ మరియు టింట్ ఎఫెక్ట్స్ అనేవి సరిగా చూసుకోకపోవడం మైనస్ అని చెప్పొచ్చు.

దర్శకుడు చంద్ర సిద్ధార్థ “రామ రామ రే” చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయడం అనేది అవసరమే అయినప్పటికీ.. ఒరిజినల్ సినిమాలోని సోల్ (ఆత్మ)ను మిస్ అయ్యారు. సినిమా నిడివి తగ్గించడం కోసం దాదాపు 20 నిమిషాల సన్నివేశాలను కట్ చేయడం.. కన్నడ వెర్షన్ వలె సిచ్యుయేషనల్ కామెడీ కాకుండా సపరేట్ బ్లాక్స్ గా వాటిని సినిమాలో జొప్పించడం సినిమాలోని మెయిన్ కంటెంట్ నుంచి ఆడియన్స్ ను డిస్కనెక్ట్ చేస్తుంది. అలాగే.. ఆయన ఈ కన్నడ రీమేక్ కోసం ప్రత్యేకంగా కన్నడ ఆర్టిస్ట్ దొడ్డన్నను ఎంపిక చేయడం అనేది కూడా మైనేస్సే అని చెప్పాలి. ఎందుకంటే ఒక నటుడిగా దొడ్డన్న తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసినప్పటికీ.. ఆయన మాటలకి లిప్ సింక్ లేకపోవడం, నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేకపోవడంతో ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది.

అలాగే.. ఉదయ్ శంకర్ పాత్రను ఒరిజినల్లో ఉండేట్లుగా ఫుల్ రఫ్ గా కాకుండా సెమీ రఫ్ గా డిజైన్ చేయడం.. ఆ పాత్రను ఉదయ్ శంకర్ పండించలేకపోవడం అనేది మైనస్. అలాగే.. సినిమా చూస్తుంతసేపూ ఏ ఒక్క ఫ్రేమ్ లో కూడా ఒక తెలుగు సినిమా చూస్తున్నామనే భావన ప్రేక్షకుడికి కలగదు.

విశ్లేషణ : “ఆటగదరా శివ” ఒక అద్భుతమైన కథ, కర్మ సిద్ధాంతం కథా వస్తువుగా తెరకెక్కిన మంచి సినిమా ఇది. అయితే.. నటీనటులు తమ నటనతో ఎమోషన్ ను పండించలేకపోవడం, సినిమాలో నేటివిటీ లేకపోవడం వంటి కారణాల రిత్యా ఈ చిత్రం అందరూ చూడదగ్గ చిత్రంగానూ కాక.. వైవిధ్యమైన చిత్రాలను ఆశించే ప్రేక్షకులనూ పూర్తి స్థాయిలో సంతుష్టులను చేసే సినిమాగానూ నిలవలేక చతికిల పడింది.

రేటింగ్ : 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus