ఎప్పుడో 2013లో “గౌరవం” చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన అల్లు శిరీష్ కి ఇప్పటివరకూ సరైన హిట్ ఒక్కటి కూడా లభించలేదు. “శ్రీరస్తు శుభమస్తు” ఫర్వాలేదనిపించుకున్నా ఆ సక్సెస్ క్రెడిట్ డైరెక్టర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. దాంతో అల్లు శిరీష్ ఖాతాలో ఒక్కటంటే ఒక్క విజయం కూడా లేకుండాపోయింది. మధ్యలో మలయాళంలోనూ మోహన్ లాల్ తో ఒక సినిమా చేశాడు కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కొన్నాళ్ళ విరామం అనంతరం “ఎబిసిడి” అనే మలయాళం సినిమా ను అదే పేరుతో తెలుగులో రీమేక్ ప్రారంభించాడు. “లేడీస్ & జెంటిల్మన్” చిత్రానికి రచయితగా పనిచేసిన సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన “కృష్ణార్జున యుద్ధం” ఫేమ్ రుక్సర్ కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. మరీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ లా కాకుండా మలయాళ మాతృక నుంచి కథా వస్తువు మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సినిమా ఉంది. ట్రైలర్లో కామెడీతోపాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఈ సినిమాతో ఫ్రెండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉండడంతోపాటు.. కంటెంట్ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సో, ఇటీవల ఆరు ఫ్లాపుల తర్వాత “చిత్రలహరి”తో తేజ్ సూపర్ హిట్ కొట్టినట్లు.. అల్లు శిరీష్ కూడా “ఎబిసిడి”తో ఫస్ట్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.