సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల చూసుకుంటే..టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి, అలాగే స్టార్ నటుడు నాజర్ తండ్రి మరణించారు.దీంతో టాలీవుడ్లో కూడా విషాద చాయాలు అలుముకున్నాయి. టాలీవుడ్లో అనే కాదు.. పక్క రాష్ట్రాల సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా నిత్యం ఏవో ఒక కారణాల వల్ల మృత్యువాత చెందుతున్నారు. మొన్ననే బాలీవుడ్ నటి భైరవి మరణ వార్త బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత కూడా కొంతమంది దర్శక నిర్మాతలు మరణించడం జరిగింది.
నటీనటులు అనే కాదు సాంకేతిక నిపుణులు లేదంటే వారి కుటుంబ సభ్యుల మరణవార్తలు కూడా బయటకి వస్తున్నాయి. తమిళ హీరో విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఈ షాక్ ల నుండి సినిమా పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో నటుడు గుండెపోటుతో మరణించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనకి హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కొల్లంలోని ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ డాక్టర్లు అతన్ని కాపాడలేకపోయారు అని తెలుస్తుంది.
ఇక కుందర జానీ పలు మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించడం జరిగింది. ఎక్కువగా ఈయన నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు, విలన్ పాత్రలు పోషించేవారు. 1979లో వచ్చిన ‘నిత్య వసంతం’ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన కుందర జానీ..కొన్ని వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ఈయన కమల్ హాసన్ నటించిన ‘రౌడీయిజం నశించాలి’ అనే సినిమాలో నటించారు.