Actor Naresh: అధ్యక్ష పదవిలో తెలుగువారే ఉండాలి.. నరేష్ కామెంట్స్!
September 29, 2021 / 08:18 PM IST
|Follow Us
‘మా’ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. బుధవారం నాడు ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్.. మంచు విష్ణు ప్యానెల్ కి మద్దతు తెలుపుతూ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. ‘మా’ అసోసియేషన్ ను నడిపించడానికి యువరక్తం కావాలని.. అందుకే మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. ‘మా’కు మరింత మంచి జరిగేందుకు మంచు విష్ణు తగిన వారసుడు అని నరేష్ చెప్పారు. మంచు విష్ణు ఒక బ్రాండ్ అని.. 75 సినిమాలు తీసి ఎంతోమందికి అన్నం పెట్టిన ఫ్యామిలీ వారిదని అన్నారు.
విష్ణు హైదరాబాద్ లోనే ఉంటారని.. ఎవరికైనా సమస్య అంటే వెంటనే స్పందిస్తానని అన్నారు. తప్పు జరిగితే విష్ణు నేను ఎక్కడికీ పారిపోలేమని అన్నారు. అనంతరం ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు నరేష్. ”20 ఏళ్లలో ఒక్కసారైనా వచ్చి ‘మా’ ఎన్నికల్లో ఓటేశారా? జనరల్ బాడీ మీటింగులకు ఒక్కసారైన హాజరయ్యారా?” అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలుగు పరిశ్రమలో సరైనవారు ఎవరూ లేరు కాబట్టి నేను ఇక్కడకి వచ్చానని ప్రకాష్ రాజ్ అన్నారని.. అంటే తెలుగువారు ఎవరూ లేరా..? అని ప్రశ్నించారు నరేష్.
ఇక్కడ పరిశ్రమను నడిపేది తెలుగువాళ్లని.. వేరే పదవులకు ఎవరు పోటీ చేసినా పర్లేదు కానీ అధ్యక్షుడి పోస్ట్ లు మాత్రం తెలుగువారే ఉండాలని అన్నారు. ఈ కుర్చీలోకి ఎవరు పడితే వారు వస్తే ‘మా’ వైభవం కోల్పోతుందని చెప్పుకొచ్చారు. అలానే.. ”ఎవరైనా ‘మా’ సభ్యులు చనిపోయినపుడు వెళ్లడం, ఎంతో కొంత ఇవ్వడం, ఫొటోలు దిగడం లాంటివి చేస్తుంటారు కొందరు. సేవా రాజకీయం, శవ రాజకీయం.. అని రెండు రకాలున్నాయి. నాకు మొదటిదే తెలుసు. కొంతమంది దగ్గర శవ రాజకీయం చూశా” అంటూ సంచలన కామెంట్స్ చేశారు నరేష్.