Naresh: పాలిటిక్స్‌పై సీనియర్ నటుడు నరేశ్ కామెంట్స్… ఇలా మాట్లాడారేంటబ్బా!
October 19, 2023 / 07:58 PM IST
|Follow Us
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి స్పందిచే విషయంలో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కొంతమంది సినిమాల జనాలు ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నారు. అయితే అది కూడా చెప్పీ చెప్పకుండా, అనీ అనకుండా చూసుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు నరేశ్ కూడా దాదాపు ఇలానే స్పందించారు. ఏదో అన్నారు కానీ… ఎక్కడా డైరెక్ట్‌గా ఏమీ అనలేదు. దీంతో ‘అసలేం మాట్లాడారబ్బా’ అంటూ సగటు సినీ- రాజకీయ అభిమాని అనుకుంటున్నారు.
ఆయన ఓ ముఖ్య పాత్రలో నటించిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే సినిమా విడుదల సందర్భంగా నరేశ్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ హీట్ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘మండేలా’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి కొనసాగుతోంది. ఈ దశలో ఇలాంటి సినిమా రావడం అవసరం అంటూ నరేశ్ (Naresh) కామెంట్ చేశారు.
రాజకీయాల్ని దగ్గర్నుంచి చూడటమే కాదు… దాదాపు పదేళ్లు యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్నాను కూడా. నాటి రాజకీయాలకీ, నేటికీ వ్యత్యాసం ఉంది. అప్పుడు వ్యక్తిగత దూషణలు లేవు. భావజాలం, అభివృద్ధి అంశాల మీదే విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిపోయింది. అలా అని అందరూ అలా మారిపోయారని చెప్పను. కానీ ఏదీ శాశ్వతం కాదు. హిట్లర్ లాంటి నాయకుల్ని చూశాం కదా ఏమయ్యారో?
ఏదేమైనా చివరికి ధర్మమే నిలుస్తుంది, అణచివేత కోసమే ఎవరినైనా బంధిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో అది తిరుగుబాటుకే సంకేతం అవుతుంది అని అన్నారు నరేశ్. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందిస్తూ ప్రత్యేకంగా ఒక నాయకుడి గురించి మాట్లాడను కానీ. ఇలాంటి విషయాలపై ప్రజలే సమాధానం చెప్పాలి. సమాజం నిశ్శబ్దంగా ఉందంటే మాట్లాడటం లేదని కాదు… అది తిరుగుబాటు కోసమే అని గుర్తుంచుకోవాలి. దీంతో నేరుగా స్పందించకుండా ఇలా ఎందుకు అన్నారు అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది.