నితిన్ తోపాటు అతడి సోదరి నిఖితారెడ్డిలపై మల్కాజిగిరి కోర్టులో నడుస్తున్న క్రిమినల్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ‘అఖిల్’ సినిమాకు సంబంధించిన హక్కులు ఇస్తామంటూ రూ.50 లక్షలు తీసుకుని, ఇవ్వకుండా మోసం చేశారంటూ సికింద్రాబాద్‌కు చెందిన జి.సత్యనారాయణ అనే వ్యక్తి మల్కాజిగిరి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇందులో నితిన్‌తోపాటు సోదరి నిఖితారెడ్డి, తండ్రి సుధాకర్‌రెడ్డిలను, శ్రేష్ఠ్ మూవీస్‌ను నిందితులుగా పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన 20వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ వేర్వేరుగా నితిన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల విచారణ చేపట్టారు. ఈ వ్యవహారం చెక్కులకు సంబంధించిన సివిల్ వివాదమని, క్రిమినల్ కేసు పెట్టడం సరికాదని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.