ప్రముఖ దర్శకుడి పేరుతో ఓ వ్యక్తి తనకు అసభ్యకర సందేశాలు పంపుతున్నాడంటూ బెంగాలీ బుల్లితెర నటి పాయల్ సర్కార్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఫేక్ సదరు వ్యక్తి తనకు తరచూ నీచమైన మెసేజ్ లు చేస్తున్నాడని కంప్లైంట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర నటి పాయల్ సర్కార్ కు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అతడి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడగా.. ప్రముఖ బెంగాలీ దర్శకుడు రవి కినాగి ఫోటోలు కనిపించాయి.
దీంతో పాటు అతడి సినిమాలకు సంబంధించిన వివరాలు కూడా ఉండడంతో ఆ ప్రొఫైల్ దర్శకుడిదే అని నమ్మేసింది పాయల్. దీంతో అతడి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది. అతడు మాట కలుపుతూ.. తను తీయబోయే సినిమాలో ప్రధాన పాత్ర ఇప్పిస్తానని ఆశ పెట్టాడు. దానికి ఆమె సంతోషించేలోపే నీచమైన మెసేజ్ లు చేయడం మొదలుపెట్టాడు. దీంతో పాయల్ కు అసలు ఇది డైరెక్టర్ అకౌంటా..? లేక ఫేక్ అకౌంటా..? అనే అనుమానం మొదలైంది.
వెంటనే అతడు పంపించిన మెసేజ్ లను స్క్రీన్ షాట్లు తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అతడి ప్రొఫైల్ చూసిన ఆమె అభిమానులు, స్నేహితులు వాళ్లు దాన్ని ఫేక్ అకౌంట్ అని తేల్చగా.. పాయల్ పోలీసులను ఆసరాయించింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. మరోపక్క తన పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దర్శకుడు రవి సైబర్ పోలీసులను కోరినట్లు సమాచారం.