ఇంటర్వ్యూ : ‘సార్’ ప్రమోషన్స్ లో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన సంయుక్త మీనన్
February 13, 2023 / 08:28 PM IST
|Follow Us
‘భీమ్లా నాయక్’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్… అదే ఏడాది ‘బింబిసార’ లో కూడా నటించి మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా బిజీ అవుతున్న సంయుక్త మరో 4 రోజుల్లో ద్విభాషా చిత్రం ‘సార్’ తో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక ‘సార్’ ప్రమోషన్లో పాల్గొన్న పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది సంయుక్త. ఆ విశేషాలు మీకోసం :
ప్ర. మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఇప్పుడు ఎలా ఉంది?
సంయుక్త : కాలేజీ రోజుల్లో సరదాగా ఓ సినిమాలో నటించా. ఆ టైంలో నటనని సీరియస్ గా తీసుకోలేదు. కేరళలోని ఓ పల్లెటూరిలో ఉండే నాకు నటనను కెరీర్ గా తీసుకోవాలనే ఆలోచన ఆ టైంలో లేదు. ఓ మంచి సినిమాలో నటించి ఆపేద్దామనుకున్నా. కానీ తర్వాత సినిమాతో ప్రేమలో పడిపోయా. ఇదే నా కెరీర్ అనే నిర్ణయానికి వచ్చేశా. అలా విధి నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. అదృష్టంతో అవకాశాలు వచ్చినప్పుడు ఎవరూ అంత సీరియస్ గా తీసుకోరు. ఒకసారి ఇదే మన వృత్తి అనుకున్నాక కష్టపడటం మొదలు పెడతారు. నేను కూడా అంతే. నాకిప్పుడు నటన అంటే దైవంతో సమానం. ఇదో ఆధ్యాత్మిక ప్రయాణంగా భావిస్తున్నాను.
ప్ర. మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తున్న మీకు తెలుగు సినిమాలో నటించడం ఎలా అనిపించింది?
సంయుక్త : ‘భీమ్లా నాయక్’ తెలుగులో విడుదలైన నా మొదటి సినిమా. నిజానికి ముందుగా ‘బింబిసార’ సినిమాకు సైన్ చేశాను. ఆ తర్వాత ‘విరూపాక్ష’ కు సైన్ చేశాను. కానీ ‘భీమ్లా నాయక్’ మొదట రిలీజ్ అయ్యింది. ‘బింబిసార’ కూడా అప్పుడే రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ‘విరూపాక్ష’ షూటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో ‘సార్’ మూవీకి ఛాన్స్ వచ్చింది. ఇందులోని లెక్చరర్ పాత్రకు నేను సరిపోతానని భావించి దర్శకనిర్మాతలు నన్ను ఎంపిక చేసుకోవడం జరిగింది.
ప్ర.తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు? ఎప్పుడు నేర్చుకున్నారు?
సంయుక్త : ‘భీమ్లా నాయక్’ నుండే తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు దాన్ని బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇబ్బంది లేకుండా మాట్లాడేస్తున్నాను. ఇవాళ నన్ను సెట్ లో అంతా తెలుగు అమ్మాయిగానే భావిస్తుంటారు. అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ క్రెడిట్ అంతా నా ట్యూటర్ ఆశకు చెందుతుంది.16 క్లాసుల్లో నేను తెలుగు నేర్చుకోవడం జరిగింది.
ప్ర. ‘సార్’ కి మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా?
సంయుక్త : మొదటి రెండు సినిమాలకు నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. కానీ ‘వీరూ పాక్ష’ షూటింగ్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి చెప్పుకోవడం కుదర్లేదు.
ప్ర.’సార్’ అనేది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీనా?
సంయుక్త : ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తీసిన సినిమానే … కానీ ప్రీచీగా అనిపించదు.కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేసి దర్శకుడు వెంకీ ఈ చిత్రాన్ని రూపొందించారు.
ప్ర.ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది?
సంయుక్త : ఈ సినిమాలో నా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. దర్శకుడు వెంకీ తెరకెక్కించే సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కూడా బలంగా ఉంటాయి. అతనిలో ఓ రచయిత కూడా ఉండటం హీరోయిన్ల పాత్రలు బలంగా రాయడానికి కారణం అని నేను నమ్ముతుంటాను.
ప్ర.ధనుష్ గారితో పని చేయడం ఎలా అనిపించింది?
సంయుక్త : ధనుష్ లాంటి స్టార్ తో కలిసి పనిచేసే అవకాశం ఇంత త్వరగా వస్తుంది అని నేను అనుకోలేదు. ఆయన నటనను నేను కూడా ఇష్టపడతాను. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ .. చాలా స్పాంటేనియస్ గా నటించేస్తారు. అలాగే సెటిల్డ్ గా కూడా పెర్ఫార్మ్ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది. నేను కూడా స్పాంటేనియస్ గా నటించడానికి ఆసక్తి చూపిస్తాను. అయితే… పాత్రోచితంగా కట్టుబొట్టు, బాడీ లాంగ్వేజ్ విషయంలో కొంత హోమ్ వర్క్ చేశాను.
ప్ర. ‘సార్’ కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?
సంయుక్త : ఈ సినిమాలో నా పాత్ర కోసం ఆంధ్రా, తెలంగాణ పల్లెల్లోని మహిళల జీవన శైలిని గమనించాను. ఓ సినిమా అంగీకరించేప్పుడు కథకు, నా పాత్రకే ప్రాధాన్యమిస్తాను. కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ‘లవ్ టుడే’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలను చెప్పుకోవచ్చు.
ప్ర.మీ లుక్స్ సమంత గారికి సిమిలర్ గా ఉంటాయనే టాక్ ఉంది.. మీరేమంటారు?
సంయుక్త : కొందరు నేను సమంతలా ఉంటానని అంటారు. అయితే అందంలో కాకుండా నటన విషయంలో ఆమెతో పోల్చితే ఇంకా సంతోషిస్తాను. ‘ది ఫ్యామిలీ మెన్’ లో సమంత అద్భుతంగా నటించారు.
ప్ర. వాలెంటైన్ వీక్ కాబట్టి.. ప్రేమ, పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి?
సంయుక్త : పెళ్లి చేసుకోవాలంటే నా ఆలోచనలకు తగ్గ వ్యక్తి దొరకాలి. నన్ను ప్రేమగా చూసుకొనే వ్యక్తి, ఎమోషన్స్ ను గౌరవించే వ్యక్తి దొరికినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. ఇటీవల ఇంటర్వ్యూ లో కొందరు యాంకర్లు కూడా పెండ్లి గురించి అడిగారు. చాలామంది యువత ‘పెళ్లి అవసరమా?’ అంటున్నారు. మహిళ కుటుంబంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇంటి పని చేస్తుంది. జాబ్ చేస్తుంది. అలాంటి ఆలోచనలు ఉన్న వారి విధానం వేరుగా ఉంటుంది.సరైన పార్టనర్ దొరికితే మహిళ సేఫ్గా ఉంటుంది. లేదంటే పెళ్లి మీద అసహనం ఏర్పడుతుంది.
ప్ర. మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి.. ‘బింబిసార2’ లో నటిస్తున్నారా?
సంయుక్త : ‘బింబిసార2’ ప్లాన్ చేస్తున్నారు. అందులో నా పాత్ర ఉంటుందో లేదో టీంతో డిస్కస్ చేసి వెల్లడిస్తాను. ఇక ‘విరూపాక్ష’ లో అయితే నా పాత్ర చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చిన పాత్ర అది.