Sona Heiden: నా జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నా : నటి సొనా హైడెన్
October 18, 2023 / 12:40 PM IST
|Follow Us
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన సోనా. 2000వ సంవత్సరం నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. తన రెండు పదుల సినీ ప్రయాణంతో పాటు తన జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా తెరకెక్కించనున్నారు. తన స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో షార్ట్‌ఫ్లిక్స్ కోసం తొలుత తమిళంలో యునిక్యూ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ తర్వాత మలయాళం, తెలుగు భాషల్లోకి అనువదించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ…
‘‘సినీ ఇండస్ట్రీలోకి 2000లో అడుగుపెట్టా. తొలి నాళ్లలో అనేక చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. వాటిని అధిగమించి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నా. కెరీర్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో చేసిన చిన్న పొరపాటు వల్ల నాకు గ్లామర్ నటి అనే టాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇండస్ట్రీలో మరో రకమైన అనుభవాలు ఎదురయ్యాయి. వీటినుంచి బయట పడేందుకు ఇండస్ట్రీకి దూరమయ్యా. కానీ, సినిమా అనేది మాయలాంటిది.
ఇండస్ట్రీ నుంచి దూరమైనా.. మనల్ని వదిలిపెట్టదు. ఒక తమిళ వార పత్రికలో నా జీవిత కథ కొన్ని నెలల పాటు ప్రచురితమైంది. దీన్ని పుస్తక రూపంలో ముద్రించా. ఇపుడు నా జీవిత చరిత్రనే వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నా. ఈనెల 18న పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభిస్తాం. గతంలో దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నా. దీంతో పాటు నేను పనిచేసిన దర్శకుల నుంచి నేర్చుకున్న అనుభవాన్ని రంగరించి ఈ బయోగ్రఫీని తెరకెక్కిస్తున్నా. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. చెన్నై, కేరళ రాష్ట్రాల్లో చిత్రీకరణ చేపడుతాం.
ఇందులో నా జీవితంలో జరిగిన అనేక మంచి చెడు సంఘటనలన్నీ ఉంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నాకు ఎదురైన యధార్థ సంఘటనలతో పాటు వాస్తవాలు ఉంటాయి. ‘స్మోక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. నటీనటులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడిస్తా. ఈ వెబ్ సిరీస్‌లో ఏ ఒక్కరి మనసును గాయపరచాలన్న ఉద్దేశం లేదు. నేటి రాజకీయాలపై అవగాహన ఉంది. కానీ, రాజకీయాల్లోకి రావాలన్న ఆశ మాత్రం లేదు’’ అని సోనా హైడెన్ (Sona Heiden) చెప్పుకొచ్చారు.