Adipurush: ‘ఆదిపురుష్’కి అరుదైన గౌరవం… ఆ ఫెస్టివల్ వారికే తొలి అవకాశం!
April 19, 2023 / 12:50 PM IST
|Follow Us
‘ఆదిపురుష్’ సినిమా గురించి వస్తున్నన్ని విమర్శలు, గొడవలు ఈ మధ్య కాలంలో ఇంకే సినిమా గురించి రాలేదు అనే చెప్పాలి. సినిమా ఫస్ట్ లుక్ అంటూ ఆ మధ్య వారణాసిలో ఈవెంట్ పెట్టడం, దాన్ని చూసిన కొంతమంది మీడియా జనాలు అహో, ఒహో అనడం, ఫ్యాన్స్ ఉప్పొంగిపోవడం జరిగిపోయాయి. అయితే ఆ టీజర్ జనాల మధ్యలోకి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ప్రభాస్ లుక్, సినిమా సెటప్ అన్నీ విమర్శల పాలయ్యాయి.
చరిత్రను మార్చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది. అయితే ఇప్పుడు ఈ చర్చ అంతా సమసిపోయేలా టీమ్‌కు ఓ బంపర్ ఛాన్స్ వచ్చింది అని చెప్పాలి. అదే.. ఈ సినిమాను ట్రిబెకా ఫెస్టివల్లో ప్రదర్శిస్తుండటం. ప్రపంచవ్యాప్తంగా ఏటా చలన చిత్రోత్సవాలు జరుగుతాయి. వాటిలో ప్రతిష్ఠాత్మకంగా భావించేవి కొన్ని ఉంటాయి. అందులో ట్రిబెకా ఫెస్టివల్ కూడా ఒకటి. అలాంటి ఫెస్టివల్లో ప్రదర్శనకు ‘ఆదిపురుష్’ సినిమా ఎంపిక అయ్యింది. ఈ మేరకు ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ట్వీట్ చేశారు.
విమర్శలు ఎదుర్కొంటున్న ఓంరౌత్ అండ్ టీమ్‌కి ఇది సంతోషం కలిగించే పరిణామం ఇది అని చెప్పొచ్చు. జూన్ 7 నుండి 18 వరకు ట్రిబెకా చలన చిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో జూన్ 13న ‘ఆదిపురుష్’ ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేశారు. ఇక సినిమా సంగతి చూస్తే… జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తారు.
టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్‌తో కలసి యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను విడుదల చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మంచి బజ్ పెంచుకోవాలని టీమ్ చూస్తోంది. దేశంలో మొత్తం 8 వేల థియేటర్లలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రోజుకు 35 వేలకుపైగా షోస్ పడేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఈ సినిమాలో (Adipurush) రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా పడింది. ఇదంతా ఒకెత్తు అయితే ఆ ఫెస్టివల్లో సినిమా పడి.. మంచి పేరు తెచ్చుకుంటే టీమ్ మీద వస్తున్న విమర్శలు ఆగుతాయేమో చూడాలి.