వేస్ట్ అన్నారు.. ఇప్పుడు దాన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు..!
December 11, 2019 / 05:50 PM IST
|Follow Us
‘అర్జున్ రెడ్డి’ చిత్రం విజయ దేవరకొండ ను పెద్ద స్టార్ హీరోని చేసేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ చేసాడు. ఈ చిత్రం అక్కడ 300 కోట్ల వరకూ వసూళ్ళను రాబట్టింది. ఇక ఈ చిత్రాన్ని విక్రమ్ కొడుకు.. ధృవ్ విక్రమ్ తో ‘ఆదిత్య వర్మ’ పేరుతో తెరకెక్కించి అక్కడ కూడా హిట్ అందుకున్నారు. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ కి పనిచేసిన గిరీశయ్య తమిళ రీమేక్ ను డైరెక్ట్ చేసాడు.
అయితే మొదట ఈ తమిళ రీమేక్ ను ‘వర్మ’ పేరుతో దర్శకుడు బాల డైరెక్ట్ చేసాడు. ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు నచ్చలేదని.. విక్రమ్ మరియు నిర్మాతలు.. మళ్ళీ మొదటి నుండీ తీయమని గిరీసయ్య చేతిలో పెట్టారు. అప్పుడు ‘ఆదిత్య వర్మ’ గా టైటిల్ మార్చి మళ్ళీ తీశారు. ఇలా దర్శకుడు బాల ను వారు అవమానించినట్టే అయ్యింది. అయితే ఇప్పుడు బాల డైరెక్ట్ చేసిన వెర్షన్ ను అంటే.. ‘వర్మ’ ను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసి క్యాష్ చేసుకునే పనిలో పడ్డారట నిర్మాతలు. ‘అప్పుడు వద్దు అనుకున్న సినిమాను ఇలా క్యాష్ చేసుకోవాలనుకోవడమేంటి..! అది కూడా ‘ఆదిత్య వర్మ’ థియేటర్ లో ఉండగా.. ఇదేం కక్కుర్తి’.. అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.