ఇలాంటివి మరికొన్ని కేసులు పడితే… సెలబ్రిటీలను యాడ్స్ చూలేమేమో!
April 27, 2024 / 11:52 AM IST
|Follow Us
సినిమా వాళ్లు మంచి చేయమని చెబితే వినేవాళ్లు ఎంతమంది ఉంటారు అని అంటే.. ఏమో వేళ్ల మీద లెక్కేట్టేయొచ్చు అని అంటుంటారు. ఎందుకంటే మన దగ్గర చెడు చెవికి ఎక్కినంత ఈజీగా మంచి ఎక్కదు. అందుకే సినిమాల్లో చూపించే మంచి కంటే… అంతర్లీనంగా ఎక్కడో ఉన్న చెడే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే కేసుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం సినిమా వాళ్లు ఇరుకున పడుతున్నారు. ఏదో ఒక ఉత్పత్తి గురించి యాడ్ ఇచ్చిన నటీనటులు ఆ తర్వాత వాళ్లకు ప్రమేయం లేకుండానే కేసులు, కోర్టులు, తాఖీదుల వరకు వెళ్లాల్సి వస్తోంది.
పై చెప్పిన మొత్తం వ్యవహారం మీకు అర్థమవ్వాలంటే తమన్నా పరిస్థితి గుర్తుకు తెచ్చుకుంటే సరి. ఓ స్ట్రీమింగ్ యాప్‌కు యాడ్ చేసిన పాపానికి ఆమె ఇప్పుడు కోర్టు నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర సైబర్ పోలీసు విభాగం తాజాగా ఆమెకు సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లను అక్రమంగా ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో ప్రదర్శించిన కేసులో తమన్నాను (Tamannaah Bhatia) ప్రశ్నించేందుకు ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 29న సైబర్ విభాగం ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
గతేడాది ఐపీఎల్ మ్యాచ్‌లను నిబంధనలకు వ్యతిరేకంగా ఫెయిర్ ప్లే యాప్‌లో ప్రసారం చేశారని, అది తమకు రూ.కోట్లలో నష్టం చేకూర్చిందని వయాకామ్ మీడియా సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇటీవల సంజయ్ దత్‌కు (Sanjay Dutt) కూడా సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్ 23న విచారణకు రావాలని అందులో చెప్పగా.. ఆయన గైర్హాజరయ్యాడు. తాను దేశంలో లేనని, వాంగ్మూలం ఇచ్చేందుకు మరో రోజున వస్తానని చెప్పారు.
ఈ నేపథ్యంలో యాప్‌లు, గేమ్‌లు లాంటి ప్రొడక్ట్‌లకు యాడ్స్ చేయాలన్నా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలన్నా సినిమా సెలబ్రిటీలకు ఇబ్బంది పడేలా పరిస్థితి మారిపోయింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే యాడ్స్ అంటేనే హీరోహీరోయిన్లు వణుకుతారేమో. యాడ్ చేసినందుకు మొత్తంగా ఆ యాప్ అక్రమాలను భుజానేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పండి.