Nagarjuna: ‘బిగ్ బాస్’ ఫైనల్ లో ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న నాగార్జున..!
February 17, 2022 / 03:31 PM IST
|Follow Us
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పుట్టిన రోజు నాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు మన కింగ్ అక్కినేని నాగార్జున. అయన ప్రకటించినట్లుగానే హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు పై అర్బన్ ఫారెస్ట్ పార్కుని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు నాగార్జున. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున తన కుటుంబ సభ్యులు అయిన అమల,నాగ చైతన్య, అఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
ఈ అటవీ పార్కు అభివృద్ది కొరకు ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్ కు అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించడం జరిగింది. “మన రాష్ట్రం, పరిసరాలు, దేశం కూడా ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలనే సంకల్పంతో, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎం.పీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని పలు సార్లు మొక్కలు నాటాను.
గత బిగ్ బాస్ సీజన్ ఫైనల్ జరుగుతున్నప్పుడు అడవి దత్తత పై సంతోష్ గారితో చర్చించాను. ఆ రోజు వేదిక పై ప్రకటించినట్లుగానే ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉంది. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు ఈ పార్కు ఎంతగానో ఉపయోగపడుతుంది” అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అడవి దత్తతకు నాగార్జున గారు ముందకు ప్రశంసనీయం’ అంటూ సంతోష్ కుమార్ కూడా నాగార్జునని అభినందించారు.