త్రివిక్రముడి వైకుంఠపురములో చూడచక్కని అంశాలు బోలెడు
January 6, 2020 / 09:32 PM IST
|Follow Us
త్రివిక్రమ్ సినిమా అంటేనే ఒక మ్యాజిక్ ఉంటుంది. అందులోనూ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. “జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి” వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే రెండోసారి జతకట్టిన ఈ చిత్రం టీజర్, పాటలు, వాటి ప్రోమోలు సృష్టించిన హల్ చల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాల్లో “అల వైకుంఠపురములో” చిత్రానిది ప్రత్యేక స్థానం. హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థ సగర్వంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను నేడు జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్ లో విడుదల చేశారు.
“దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకి, రెండు వాళ్ళకి, గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునేవాళ్లతోనే” వంటి త్రివిక్రమ్ మార్క్ ఎమోషనల్ డైలాగ్స్.. “పులొచ్చింది.. మేక సచ్చింది, దీనికి విజిల్ ఒకటే సరిపోదు.. బద్దలైపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్ లో గాల్లో కోట్ ఎగరడాలు.. చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి నేను ప్లాన్ చేస్తాను” వంటి హీరో ఎలివేషన్ డైలాగ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అల్లు అర్జున్ కొత్తగా కనిపించడమే కాదు.. డైలాగ్ మాడ్యులేషన్ కూడా మార్చాడు. పూజా హెగ్డే ఎప్పట్లానే సైలెంట్ గా అందంగా కనిపించింది. సముద్రఖని క్యారెక్టరైజేషన్ బాగుంది.. టబు, జయరాం, రాజేంద్రప్రసాద్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. అన్నిటికంటే తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి మెయిన్ హైలైట్. ఈ సంక్రాంతికి “అల వైకుంఠపురములో” గట్టిపోటీ ఇచ్చేట్లుగానే ఉంది.