‘పుష్ప’ సినిమా చూసి… థియేటర్ నుండి ప్రేక్షకుడు బయటికొస్తుంటే గుర్తుండిపోయేలా అల్లు అర్జున్‌తో ఓ డైలాగ్ చెప్పించారు సుకుమార్. అదే ‘బ్రాండ్’. సినిమాలో హీరో క్యారెక్టర్‌ను స్టేబుల్ చేయడానికి ఈ అంశాన్నే వాడుతుంటారు విలన్లు, పోలీసులు. ‘బాహుబలి’లో ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న అంత బలంగా ఈ పాయింట్ లేకపోయినా… రెండో పార్టులో ఆ బ్రాండ్ వాల్యూ గురించి సీన్లు, క్లారిఫికేషన్లు, దమ్ములు, ఎలివేషన్లు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నిజానికి సినిమాలో ఈ సీన్‌ని అంతగా ఎలివేట్ చేయలేదనే కామెంట్లూ ఉన్నాయి.
అప్పుడు సుకుమార్ అలా వదిలేశాడేమో, అల్లు అర్జున్ మాత్రం అస్సలు వదలడం లేదు. బ్రాండ్ అనే మాటను ఓ హ్యాష్ట్యాగ్గా మార్చి ట్రెండింగ్‌లో ఉండాలని చూస్తున్నాడు. అయితే ఇది సోషల్ మీడియాలో కాదు. లైవ్‌లో చేస్తున్నాడు. దిల్ రాజు వారసుడిగా తెరంగేట్రం చేస్తున్న ఆశిష్ రెడ్డి సినిమా ‘రౌడీ బాయ్స్’ ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో తన ‘పుష్ప’ సినిమా ప్రచారం కూడా కానిచ్చేశాడు. ‘ఇది సర్ నా బ్రాండ్’ అంటూ ఓ డిజైన్ చేసి ఉన్న జాకెట్ వేసుకొని కార్యక్రమానికి వచ్చాడు అల్లు అర్జున్. అంతేకాదు దానిని చూపించి మరీ ప్రచారం చేశాడు.
అయితే అల్లు అర్జున్ ఈ పని సినిమా ప్రచారం కోసం మాత్రమే కాదు… రియల్ లైఫ్ ఎలివేషన్ కోసం కూడా చేశాడు అని అంటున్నారు నెటిజన్లు. మెగా బ్రాండ్ నుండి పక్కకు వచ్చి తనదైన బ్రాండ్‌ను సృష్టించుకునే పనిలో చాలా రోజుల నుండి అల్లు అర్జున్ ఉన్నాడు. మెగా ఫ్యాన్స్ అని మాట ఈ మధ్య బన్నీ నోట వినిపించడం లేదు. అల్లు అర్జున్ ఆర్మీ.. ఏఏ ఆర్మీ అంటూ ఓ నినాదం తీసుకొచ్చాడు. దానిని ప్రతి వేదిక మీద చెబుతూనే ఉన్నాడు.
తాజాగా ‘రౌడీ బాయ్స్’ స్టేజీ మీద కూడా ఇదే పని చేశాడు అంటున్నారు నెటిజన్లు. అయితే మెగా ఇమేజ్‌కు దూరంగా వెళ్లి అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడా? లేక తనకు తాను ఓ ఇమేజ్ను బలంగా మార్చుకోవాలని చూస్తున్నాడా? అనేది తెలియాలి. ఒకవేళ ఇదంతా బన్నీ తన సినిమా ‘పుష్ప’ ప్రచారం కోసమే చేస్తే హ్యాపీనే. లేకపోయినా ఓ వర్గానికి హ్యాపీనే.