స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బులి తెరలోకి అడుగు పెట్టబోతున్నారా? పెద్ద షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారా? అంటే.. ఫిలిం నగర్ వర్గాల వారు అవుననే సమాధానం చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది స్టార్ మా ఛానల్ వాళ్ళు బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ షో ని నిర్వహించారు. ఇందుకు తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. అప్పటి వరకు ఉన్న టెలివిజన్ రికార్డులన్నింటినీ ఈ షో ద్వారా తారక్ తిరగరాశారు. ఈ షో అత్యధికంగా టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్), టీవీపీ (టెలివిజన్ వీవర్స్ పాయింట్) పాయింట్స్ రాబట్టి స్టార్ మా ఛానల్ వీవర్స్ ని పెంచింది.
ఆ ఉత్సాహంతో ఛానెల్ వాళ్ళు సీజన్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోనూ ఎన్టీఆర్ ని హోస్ట్ గా వ్యవహరించమని కోరారు. కానీ అందుకు తారక్ ఒప్పుకోలేదు. తనకున్న సినిమా, ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల నో చెప్పినట్లు సమాచారం. దీంతో నిరాశపడ్డ స్టార్ మా ఛానల్ వాళ్ళు ఎన్టీఆర్ క్రేజ్ కి సరితూగే మరో స్టార్ హీరో అల్లు అర్జున్ ని హోస్ట్ గా ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ షో కి హోస్ట్ గా చేయడానికి బన్నీ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఈ షో అగ్రిమెంట్స్ పై త్వరలోనే సంతకాలు చేయనున్నారు. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు.