ఇంద్రగంటి దర్శకత్వంల్ రూపొందిన హిలేరియాస్ కామెడీ ఎంటర్ టైనర్ “అమీ తుమీ”. అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ లు కథానాయికలుగా.. వెన్నెల కిషోర్ ప్రత్యేక పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : అనంత్ (అడివి శేష్)-దీపిక (ఈషా రెబ్బ), విజయ్ (అవసరాల శ్రీనివాస్)-మాయ (అదితి మ్యాకల్)లు తమ పెద్దలు అంగీకరించకపోయినా పెళ్లి చేసుకోవాలనుకొంటారు.అయితే.. విజయ్, దీపికల తండ్రి జనార్దన్ (తనికెళ్ళభరణి) వీరిద్దరి పెళ్లికి అడ్డంగా నిలుస్తాడు. ఎలా పెళ్లి చేసుకోవాలా అని సతమతమవుతున్న తరుణంలో కథలోకి ఎంట్రీ ఇస్తాడు శ్రీ చిలిపి (వెన్నెల కిషోర్). దీపికను పెళ్లి చేసుకోడానికి వైజాగ్ నుంచి వచ్చిన శ్రీ చిలిపిని అందరూ వాడుకొని తమ పెళ్లి ఎలా చేయించుకొన్నారన్నదే “అమీ తుమీ” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : పేరుకి అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ లు సినిమాకి హీరోలే కానీ.. సినిమాలో రియల్ హీరో మాత్రం వెన్నెల కిషోర్. తన కామెడీ టైమింగ్ తో, టిపికల్ ఎక్స్ ప్రెషన్స్ తో హిలెరియస్ గా ఎంటర్ టైన్ చేశాడు. ముఖ్యంగా పెళ్లిచూపులు ఎపిసోడ్ లో వెన్నెల కిషోర్ ను చూసి నవ్వని ప్రేక్షకుడుండడు. ఇక కిషోర్ బాబు పెరాలిసిస్ వచ్చినట్లుగా పడిపోయే సీన్లకు థియేటర్ దద్దరిల్లడం ఖాయం. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకి విజయ్ పాత్రలో న్యాయం చేయడం పక్కన పెట్టి.. వచ్చీరాని విధంగా తెలంగాణ యాసతో మాట్లాడుతూ చిరాకు పుట్టించాడు. అవసరాలకు సన్నివేశాలు కూడా కాస్త తక్కువగానే ఉండడంతో బాబు గురించి పట్టించుకోవాల్సిన అవసరం అంతగా లేదనే చెప్పాలి.
అడివి శేష్ మొదటిసారి కామెడీ రోల్ చేయడం వలన అతడు కామెడీ టైమింగ్ ను మెయింటైన్ చేయడం కోసం పడే ఇబ్బంది అతడి మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే.. కొంతలో కొంత వెన్నెల కిషోర్ తర్వాత నవ్వించినా ఆకట్టుకొన్నా అది అడివి శేషే. తనికెళ్లభరణి నటన మొదట్లో కాస్త అతి అనిపించినా.. తర్వాత తనదైన కామెడీ టైమింగ్ తో విశేషంగా కాకపోయినా ఓ మోస్తరుగా నవ్వించాడు. ఈషా రెబ్బ కూడా స్టార్టింగ్ లో తెలంగాణ యాసతో విసుగు తెప్పించినా.. తర్వాత నటనతో పర్వాలేదనిపించుకొంది.
“పోష్ పోరీస్” ఫేమ్ అదితి మ్యాకల్ సహజమైన నటనతో ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. పైగా.. అవసరాలతో అమ్మడి రొమాన్స్ ఏమాత్రం కుదరలేదు. దాంతో పెయిర్ చూడ్డానికి కూడా వింతగా ఉంది. అయితే.. సరైన పాత్ర లభిస్తే తనను తాను ప్రూవ్ చేసుకోగల పూర్తి సత్తా అమ్మడిలో ఉందని అర్ధమవుతుంది. మధుమణి-కేదార్ నాధ్ ల అతి చిరాకు పుట్టిస్తుంది. శ్యామలా దేవి నటనలో సహజత్వమెక్కడా కనిపించదు. పైపెచ్చు ఆవిడగారి అస్తమానం ఎగురుతూ చేసే రచ్చకి చిరాకు పుట్టడం ఖాయం. కానీ.. వెన్నల కిషోర్ కాంబినేషన్ సీన్స్ లో కామెడీ పండించడానికి ఆమె చేసే అతే తోడ్పడడం విశేషం.
సాంకేతికవర్గం పనితీరు : పి.జి.విందా ఎప్పట్లానే తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చాడు. 360 డిగ్రీస్ షాట్, ఒకటే సీన్ లో డిఫరెంట్ ఫ్రేమ్స్ తో తన కెమెరా పనితనాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించాడు. మణిశర్మ సంగీతం-నేపధ్య సంగీతం ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్. సినిమాలో కామెడీ సీన్స్ కు తన డిఫరెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేశాడు. ఇక వెన్నెల కిషోర్ కు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కిషోర్ కెరీర్ లో బెస్ట్. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-మాటలు సమకూర్చడంతోపాటు దర్శకత్వ బాధ్యత కూడా చేపట్టిన మోహనకృష్ణ ఇంద్రగంటి.. ఒక్క మాటల రచయితగా తప్పితే.. మిగిలిన విభాగాల్లో తన సిగ్నేచర్ ను ప్రూవ్ చేసుకోలేకపోయాడు.
తెలుగు భాషపై మోహనకృష్ణకు ఉన్న పట్టు-అభిమానం ప్రతి మాటలోనూ వినిపిస్తుంది. అయితే.. కథలోనే పెద్దగా విషయం లేకపోవడంతో.. స్క్రీన్ ప్లే కూడా చాలా పేలవంగా ఉంటుంది. దర్శకుడిగానూ బొటాబొటి మార్కులతో పాస్ అయ్యాడు. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్, కథనం లాంటి విషయాలపై ఏమాత్రం కాన్సన్ ట్రేట్ చేయకుండా.. కేవలం కామెడీతో సినిమాని నిలబెట్టేయాలనుకోవడం పూర్తి స్థాయిలో సత్ఫలితాన్నివ్వలేదు. వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ మినహా సినిమా మొత్తం చాలా పేలవంగా ఉంటుంది. వెన్నెల కిషోర్ మళ్ళీ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడా అని ప్రేక్షకుడు ఎదురుచూస్తుంటాడు.
విశ్లేషణ : వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్, మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణలుగా రూపొందిన “అమీ తుమీ” పూర్తి స్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుగా అలరిస్తుంది. స్క్రీన్ ప్లే సరిగా ఉండుంటే హిలేరియాస్ ఎంటర్ టైనర్ గా నిలిచి ఉండదు. ఈ వారం సరదాగా కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమిదే కావడం, మరో సినిమా “ఆరడుగుల బుల్లెట్” విడుదల ఆగిపోవడం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్.