అమ్మ‌మ్మ‌గారిల్లు

  • May 25, 2018 / 04:41 PM IST

నాగశౌర్య-షామిలీ జంటగా తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అమ్మమ్మగారిల్లు”. సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి కొన్ని నెలల ముందే విడుదలవ్వాల్సి ఉన్నా కారణాంతరాల వలన విడుదలకాలేకపోయింది. మొత్తానికి నేడు (మే 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఛలో”తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన నాగశౌర్య “అమ్మమ్మగారిల్లు”తో ఆ ఫామ్ ను కంటిన్యూ చేయగలిగాడో లేదో చూద్దాం..!!

కథ : తాను ఉన్న చోట అందరూ సంతోషంగా ఉండాలని కోరుకొనే మంచి మనసున్న కుర్రాడు సంతోష్ (నాగశౌర్య). ఎప్పుడో చిన్నప్పుడు తన తండ్రికి, మావయ్యకి జరిగిన గొడవల కారణంగా 20 ఏళ్లుగా తనకు బాగా ఇష్టమైన అమ్మమ్మగారింటికి వెళ్లలేకపోతాడు. అయితే.. అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె వద్దకు వెళ్ళి కొన్నాళ్లు గడపాలనుకొంటాడు సంతోష్. అందుకు తండ్రి కూడా అంగీకరించడంతో అమ్మమ్మగారింటికి చేరుకొంటాడు సంతోష్.

తనతోపాటు మావయ్యలు, పిన్ని కూడా రావడంతో అమ్మమ్మ కళ్ళలో మళ్ళీ ఆనందం చూడొచ్చు అనుకొంటాడు. కానీ.. వాళ్ళందరూ వచ్చింది వాళ్ళ అమ్మను చూడడం కోసం కాదని ఆస్తిని వాటాలుగా వేసుకొని, ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ అయిపోగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోవడానికని తెలుసుకొని బాధపడతాడు. ఆ సమయంలో అమ్మమ్మను సంతోషపరచడమే ధ్యేయంగా పెట్టుకొన్న సంతోష్ తన తెలివిని ఉపయోగించి రిజిస్ట్రేషన్ అవ్వనివ్వకుండా మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఒక్కరోజు కోసం అంటే ఆపాడు కానీ.. అమ్మమ్మ కళ్ళల్లో ఆనందం ఎక్కువరోజులు ఉండేలా చేయగలిగాడా లేదా అనేది “అమ్మమ్మగారిల్లు” కథాంశం.

నటీనటుల పనితీరు : నటుడిగా నాగశౌర్యను మరో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఎమోషన్స్, సెంటిమెంట్, బాడీ లాంగ్వేజ్ విషయాల్లో చాలా డవలప్ అయ్యాడు. డైలాగ్ డెలివరీలో మాత్రం ఇంకాస్త స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. బేబీ షామిలీ రీఎంట్రీలో కూడా ఫెయిల్ అయ్యింది. అందంగానూ కనిపించక, అభినయంతోనూ ఆకట్టుకోలేక తాను ఇబ్బందిపడి, ప్రేక్షకుల్ని కూడా ఇబ్బందిపెట్టింది.

రావు రమేష్ ఎప్పట్లానే రొటీన్ మేనరిజమ్ తో బోర్ కొట్టించాడు. ఆయన డైలాగ్స్ లో మీనింగ్ ఉన్నప్పటికీ.. రిపీటెడ్ మ్యానరిజమ్స్ & యాక్టింగ్ కారణంగా పాత్ర పెద్దగా పండలేదు. సమ్మెట గాంధీ చాలా రోజుల తర్వాత అర్ధవంతమైన పాత్రలో కనిపించారు. హేమ, శివాజీ రాజా తమదైన నటనతో ఆకట్టుకొన్నారు. షకలక శంకర్ కామెడీతో నవ్వించడానికి ప్రయత్నించినప్పటికీ.. సన్నివేశాల్లో పెద్దగా పస లేకపోవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.

సాంకేతికవర్గం పనితీరు : రసూల్ సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. ప్రతి సన్నివేశాన్ని చాలా అందంగా, ఒక పెయింటింగ్ లా చిత్రీకరించాడు. ముఖ్యంగా పల్లెటూరి అందాల్ని ఇంకాస్త అందంగా, కలర్ ఫుల్ గా చూపించిన విధానం సినిమాకి ప్లస్ పాయింట్. అలాగే.. మనెక్వీన్ చాలెంజ్ ఫార్మాట్ లో బుల్లెట్ టైమ్ షాట్ తో సినిమాని ప్రారంభించి, ముగించిన విధానం బాగుంది. కళ్యాణ రమణ సంగీతం బాగుంది. పాటలు వినసోంపుగా ఉన్నాయి. నేపధ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోశాడాయన. సన్నివేశంలోని ఎమోషన్ సరిగా ఎలివేట్ అవ్వక ఇబ్బందిపడుతున్న తరుణంలో కళ్యాణ రమణ సంగీతం సహాయపడింది. ఎడిటింగ్, కలరింగ్, డి.ఐ వంటి సాంకేతికపరమైన అంశాలన్నీ సినిమాకి ప్లస్ పాయింట్ గానే నిలిచాయి.

అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ సినిమాకి కథ పెద్ద మైనస్. కథలో కావాల్సినంత ఎమోషన్ ఉన్నప్పటికీ.. కథ “శతమానం భవతి”ని తలపించడం వల్ల ప్రేక్షకుడు పెద్దగా ఎగ్జైట్ అవ్వడు. కథ మాత్రమే కాక స్క్రీన్ ప్లే ఫార్మాట్ కూడా ఆ సినిమాను కాస్త గట్టిగానే గుర్తుకుతెస్తుంది. ఇక కథనం మరీ నత్తనడకలా సాగడం వల్ల యూత్ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకోవడం అనేది జరిగే పని కాదు. సో, ఈ చిత్రంలోని కథ-కథనం-మాటలు-దర్శకత్వం వంటి శాఖలకు సారధ్యం వహించిన సుందర్ సూర్య హృద్యమైన సంభాషణలతో రచయితగా పర్వాలేదనిపించుకోగలిగాడు కానీ.. దర్శకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అయితే.. ఒక మంచి సినిమా మాత్రం తీశాడానే చెప్పాలి.

కాకపోతే.. కథ-కథనం చాలా పాత సినిమాలని తలపించడంతో ప్రేక్షకుడు ఎంటర్ టైనింగ్ గా ఫీల్ అవ్వడు. అలాగని కొత్తగా దర్శకుడు చెప్పిన విషయం కూడా ఏమీ లేదు. ఇదే మెసేజ్ ను ఇప్పటికే చాలా సినిమాలు అందించాయి.

విశ్లేషణ : అసభ్యమైన సంభాషణలు, సన్నివేశాలు లేని ఒక మంచి సినిమా చూశామే తృప్తి కోసం “అమ్మమ్మాగారిల్లు” చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు. కాకపోతే.. కథ-కథనం మాత్రం రొటీన్ గానే ఉంటాయి. అయితే.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం నిలదొక్కుకోవడం కాస్త కష్టమే.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus