Anji Movie: దర్శకుడు చెవుతూనే ఉన్నాడు..చిరంజీవి వింటేగా..!
February 15, 2022 / 08:42 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలలో అంజి ఒకటి. ఫ్యాన్టసీ స్టోరీతో విజువల్ ఎఫెక్ట్స్ తో గ్రాండ్ గా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కోడి రామకృష్ణ. 2004లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, ప్రభాస్ వర్షం బరిలో దిగాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన అంజి ఫలితం పరంగా ఆ రెండింటికంటే వెనుకబడింది. ఈ చిత్ర ఫలితం ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఐతే మరి ఈ సినిమా ఎలా కార్యరూపం దాల్చింది, దాని వెనుకున్న నేపథ్యం ఏమిటనేది దివంగత కోడిరామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
చిరంజీవి ఇంద్ర, ఠాగూర్ వంటి రెండు వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చి మంచి ఊపుమీద ఉన్నారు. ఆ సమయంలో ప్రొడ్యూసర్ శ్యాం ప్రసాద్ రెడ్డి చిరంజీవితో ఓ భారీ గ్రాఫిక్ సినిమా చేద్దాం అని డేట్స్ తీసుకున్నారట. ఆ సినిమా తీసే బాధ్యత కోడిరామకృష్ణను అప్పగించాడట ఆయన. ఐతే చిరంజీవి లాంటి స్టార్ తో మంచి కమర్షియల్ సినిమా చేయడం కరెక్ట్, నాదగ్గర డ్యూయల్ రోల్ తో మంచి స్క్రిప్ట్ ఉంది అది చేద్దాం అని అన్నారట కోడిరామకృష్ణ. శ్యాంప్రసాద్ రెడ్డి దానికి ఒప్పుకోలేదట, గ్రాఫిక్ మూవీ చేయాల్సిందే అని పట్టుబట్టారట.చిరంజీవిని అయినా కన్విన్స్ చేద్దాం అని రామకృష్ణ ఆయన్ని, కలువగా చిరంజీవి కూడా గ్రాఫిక్ మూవీనే చేద్దాం అన్నారట. దానితో ఆయన కష్టపడి చిరంజీవి కోసం ఫాంటసీ కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ సిద్ధం చేసి ఆ సినిమా తెరకెక్కిచారట.
అంజి కోసం చాల పరిశోధన చేసి సుదీర్ఘ కాలం షూటింగ్ జరిపారట. ఇక చిరంజీవి ఆ సినిమా కోసం పడ్డ కష్టం మాములు కష్టం కాదట. ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశం కోసం చిరంజీవి ఒకే షర్ట్ ఉతకకుండా రెండేళ్లు వేసుకోవాల్సివచ్చిందట. ఓ కొత్త ఆర్టిస్టులా కష్టపడి నటించారు చిరంజీవి అని కోడిరామకృష్ణ తెలిపారు. ఇక ఆ మూవీ ఫలితం ఏదైనా నాకు సంతృప్తిని ఇచ్చిన సినిమా అంజి అని చెప్పుకొచ్చారు. భారీ అంచనాలే కొంపముంచాయి అన్నారు స్వర్గీయ కోడి రామకృష్ణ.