హలోబ్రదర్ లోని ఆ అంశం నాగబాబు సినిమా నుండి కాపీ..!
April 22, 2020 / 09:11 PM IST
|Follow Us
జంధ్యాల తరువాత కామెడీ చిత్రాల దర్శకుడిగా ఆ స్థాయి పేరు తెచ్చుకున్న దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ. ఆయన దర్శకత్వంలో నాగార్జున హీరోగా చేసిన హలో బ్రదర్స్ బ్లాక్ బస్టర్ మూవీ. 1994లో విడుదలైన హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ చేయగా ట్విన్స్ అయినా హీరోలు రిఫ్లెక్షన్ మెంటాలిటీ కలిగి ఉంటారు. అప్పటికి తెలుగు సినిమాకు అంతగా పరిచయం లేని ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు తెగనచ్చేసింది. నాగార్జున క్లాస్ మాస్ గెటప్స్ లో ఇరగదీయగా కిలాడీ భామగా రమ్యకృష్ణ, అమాయకపు క్యూటీ అమ్మాయిగా సౌందర్య నటించారు. కె ఎల్ నారాయణ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి మాటలు ఎల్ బి శ్రీరామ్ అందించడం విశేషం. ఐతే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ గొప్ప అంశం, కోట శ్రీనివాసరావు, మల్లికార్జున రావుల కామెడీ ట్రాక్.
పిక్ పాకెటర్ నాగార్జున, బ్రహ్మానందం బ్యాచ్ ని పట్టుకోవడానికి నానా కష్టాలు పడే ఎస్ ఐ మట్టయ్యగా కోట, కానిస్టేబుల్ చిట్టిగా మల్లికార్జునరావు నటించారు. ఇంగ్లీష్ సరిగా రాని అమాయకపు ఎస్ ఐ మట్టైయ్యను.. చిట్టి ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాడు. ఈ కామెడీ ట్రాక్ మంచి వినోదం పంచడంతో పాటు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఐతే వీళ్లిద్దరి కామెడీ ట్రాక్ ఈ వి వి హలో బ్రదర్ సినిమా కోసం ప్రత్యేకంగా రాసుకుంది కాదు.
ఈ వి వి గారు 1992లో ఓ ఇంగ్లీష్ మూవీ స్ఫూర్తితో కామెడీ అండ్ ఎమోషన్ ప్రధానంగా 420 అనే సినిమా తీశారు. నాగబాబు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ సినిమాలో సేమ్ కామెడీ ట్రాక్ పేర్లతో సహా కోట, మల్లికార్జున రావు చేశారు. ఆ సినిమా ఆడకపోవడంతో ఆ కామెడీ ట్రాక్ కూడా జనాల్లోకి వెళ్ళలేదు. ఎంతో ఇష్టపడి రాసుకున్న ఆ కామెడీ ట్రాక్ ని స్వల్ప మార్పులతో ఈ వి వి హలో బ్రదర్ సినిమా కోసం వాడుకున్నారు. నాగబాబు సినిమాకు ఫట్ అన్న ఆ కామెడీ ట్రాక్ నాగార్జున మూవీలో మంచి హిట్టైంది.