ఏలూరులోని కొవ్వలి అనే ఓ మారుమూల పల్లెటూరులో పుట్టిన ఓ అమ్మాయికి తల్లిదండ్రులు చదువు చెప్పించలేక నాలుగో తరగతిలోనే స్కూల్ మాన్పించేశారు. చిన్న వయసులోనే పెళ్ళి చేసి అత్తారింటికి పంపేశారు, అక్కడ భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి కొత్త జీవితాన్ని ఎతుక్కుంటూ, చెన్నై రైల్ ఎక్కేసింది. కాలం గిర్రున తిరిగితే కొన్నేళ్ళకే వెండితెరను ఏలే శృంగార తారగా మారింది. ఆమె విజయలక్ష్మీ వడ్లపాటి అందరికీ తెలిసిన సిల్క్ స్మిత. ఓ సినిమాకు మించిన నాటకీయత ఉన్న సిల్క్ స్మిత జీవితం చీకటి వెలుగుల అధ్యాయం.
450 పైగా సినిమాలలో నటించిన తారా సుందరి సిల్క్ జీవితం ముగిసిన తీరు బాధాకరం. 35 ఏళ్లకే చనిపోయిన సిల్క్ స్మిత తను శృంగార తారగా ఎలా మారారో ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ”నిజానికి నేను మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకున్నాను. తమిళంలో నేను చేసిన వందిచక్రం మూవీలో సిల్క్ స్మిత అనే బార్ డాన్సర్ గా గ్లామర్ రోల్ చేశాను. ఆ పాత్ర నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. దీనితో దర్శక నిర్మాతలు అలాంటి పాత్రలకే నన్ను సంప్రదించడం మొదలుపెట్టారు.
వారిని నిరుత్సాహపరచడం ఇష్టం లేక కాదనకుండా వరుసగా గ్లామర్ రోల్స్ చేయడం జరిగింది. అలా సిల్క్ స్మిత అంటే గ్లామర్ హీరోయిన్ అని ముద్రపడిపోయింది..” అన్నారు సిల్క్ స్మిత. ఆమె ఇంకా మాట్లాడుతూ పరిశ్రమలో భారతి రాజా, బాలు మహేందర్ తనకు ఇష్టమైన దర్శకులు అని చెప్పారు. హీరోలలో కమల్ హాసన్, చిరంజీవి పక్కన చేయడం బాగా ఉంటుంది, వారు మంచి డాన్సర్స్ అన్నారు సిల్క్ స్మిత. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నైలోని తన అపార్ట్మెంట్ లో శవమై కనిపించారు. ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి.