కొందరు బొద్దుగా ఉంటే బావుంటారు. మరికొందరు మల్లెతీగలా సన్నగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది బొద్దుగా కనిపించే భామలు సన్నబడేందుకు తంటాలు పడుతున్నారు. సన్నగా కనిపించడమే ఫ్యాషన్ అని అంటున్నారు. ఇదే ఫార్ములా పాటించిన నటి అంజలి మాత్రం ఇబ్బంది పడుతోంది. లావు తగ్గడంలో వచ్చిన ఇబ్బంది కాదు. అంజలి బరువు తగ్గింది. సన్నగా కనిపిస్తోంది. అయితే ఆమె అభిమానులు మాత్రం సన్నగా కనిపిస్తున్న అంజలిని మెచ్చడం లేదట. గతంలో లాగే బొద్దుగా ఉన్నపుడే బావున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఒకలా తలిస్తే మరొకలా ఫలితం రావడంతో అంజలికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రశంసలకు బదులు విమర్శలు రావడంతో పునరాలోచనలో పడిందని అంటున్నారు. అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాలే ఎక్కువగా చేసింది. అడపాదడపా తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తమిళ్లో నాయికలంతా బొద్దుగా ఉంటారు. అలా ఉంటేనే అక్కడి ప్రేక్షకులు మెచ్చుతారు. ఇదంతా ఆలోచించని అంజలి ఇబ్బంది పడుతోంది. దీనిపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.