సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్..!
September 8, 2021 / 10:20 PM IST
|Follow Us
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ పై బాగా పగబట్టేసింది అని మరోసారి పరోక్షంగా స్పష్టంచేసింది. రైల్వే టికెట్లు కొనుగోలు చేసుకునే తరహాలోనే సినిమా టికెట్లను కూడా కొనుగోలు చేసుకోవాలని ఓ వింత జీవో ని విడుదల చేసింది. ఇందుకు తగినట్టుగా ఓ పోర్టల్‌ను విడుదల చేయాలని ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ‘వకీల్ సాబ్’ సినిమా టైములో టికెట్ రేట్లను తగ్గించేస్తూ వై.ఎస్.జగన్ ప్రభుత్వం జీవోని జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతీ సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ టికెట్ రేట్లను తగ్గించేసింది.ఈ రేట్లతో థియేటర్లను నడపడం చాలా కష్టమని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందినప్పటికీ వారు లెక్కచేయలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల టికెట్ ధరలు విషయం పై చర్చించేందుకు టాలీవుడ్ నుండీ మెగాస్టార్ కు పిలుపు వచ్చింది. ఇండస్ట్రీ పెద్దలతో జగన్ ను మీట్ అయ్యేందుకు చిరు కూడా తన సొంత ఇంట్లో ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం అయ్యారు.కానీ ఈలోపే ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ జనాలకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీని వల్ల జనాలకు నష్టం ఏమీ ఉండదు కానీ..
ఆ కలెక్షన్లలో డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్ల వాటా వారికి ఎప్పుడు చెల్లిస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఇందులో కూడా అవకతవకలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవ్వడం ఖాయం. తెలుగు సినిమా పరిశ్రమ నుండీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దగా రెవెన్యూ, టాక్సులు రావడం లేదని భావించి వై.ఎస్.జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనే కామెంట్లు కూడా ఇప్పుడు మొదలయ్యాయి.