ఆన్లైన్ టికెటింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి షాక్!
July 2, 2022 / 11:22 AM IST
|Follow Us
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ‘అనుబంధ’ ఆన్లైన్ టికెటింగ్‌ను తీసుకొద్దామని చూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై హైకోర్టు స్టే విధించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించేలా గతేడాది ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం, తీసుకొచ్చిన ఉత్తర్వులను బుక్‌మై షో సహా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ సంస్థల వ్యాపారాన్ని దెబ్బ తీస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల్లో భాగంగా పిటిషనర్ల న్యాయ వాదులు ‘‘ప్రభుత్వమే నేరుగా ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తే అభ్యంతరం లేదు. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమ్మాలని కోరడం సరికాదని’’ వాదించారు.
టికెట్ విక్రయానికి రూ.2 సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తాంటోంది ప్రభుత్వం. దీంతో ప్రేక్షకులపై తాము అదనంగా భారం వేయాల్సి ఉంటుందని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కొత్త ఆన్లైన్ విధానంలో టికెట్ల విక్రయంలో పారదర్శకత పెరుగుతుందని వివరించారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టవచ్చని తెలిపారు. బుక్‌మై షో ద్వారా వినియోగదారుడు టికెట్ కొనుగోలు చేస్తే వినియోగదారుడు అదనంగా 14 నుంచి 17 శాతం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. యువర్ స్క్రీన్స్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం ఇస్తామని, దానికి గాను వినియోగదారుడి నుండి రూ.1.95 మాత్రమే సేవా రుసుముగా తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలా వచ్చిన డబ్బుల్ని ఏ రోజుకారోజు థియేటర్ల యాజమాన్యానికి అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున థియేటర్ల యజమానుల నుండి నిరసన వ్యక్తం అవుతోంది.