Aswani Dutt: నిర్మాతల బంద్‌పై నిర్మాత అశ్వనీదత్ ఫైర్!
August 12, 2022 / 02:54 PM IST
|Follow Us
సినిమా ఇండస్ట్రీ సమస్యల లెక్క తేల్చడానికి అంటూ.. గత కొన్ని రోజులు టాలీవుడ్ నిర్మాతలు బంద్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆ మధ్య ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ స్పందించారు. బంద్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంటూ.. కొన్ని వార్తలొచ్చి ఆ తర్వాత ఆగిపోయాయి. ఆయన ఆఫ్ ది రికార్డు అన్నారని సన్నిహితులు, ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అయితే ఆయన మరోసారి సినిమా ఇండస్ట్రీ బంద్ గురించి మాట్లాడారు. బంద్ గురించి, ఇండస్ట్రీ పరిస్థితుల గురించి ఘాటైన వ్యాఖ్యలే చేశారు.
తమ రాబోయే సినిమా ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడు లేదని, ఒకవేళ ఉండి ఉంటే… కచ్చితంగా సినిమా షూటింగ్ ప్రారంభించేవాణ్ని అని అన్నారు అశ్వనీదత్. దీంతో నిర్మాతల బంద్ విషయంలో అశ్వనీదత్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతోపాటు ఆయన సినిమా థియేటర్ల పరిస్థితి, ఓటీటీల గురించి కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయంటూ ఆయన కామెంట్స్ చేశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఓటీటీ ఏమీ చేయలేదని కామెంట్స్ చేసిన అశ్వనీదత్.. ఇప్పటికే యూట్యూబ్ వల్ల చాలా మార్పు వచ్చిందని చెప్పారు. యూట్యూబ్‌లో ఏదైనా విషయం గురించి చిన్నగా రాస్తే చాలు.. అందరూ అన్నీ వదిలేసి అటువైపు వెళ్లిపోతున్నారని విశదీకరించారు అశ్వనీదత్. దీంతో ఓటీటీల విషయంలో మన నిర్మాతలు పడుతున్న భయం అక్కర్లేదు అని ఆయన చెప్పారు. ఓటీటీల వల్ల యూట్యూబ్‌లకు వచ్చే ఇబ్బందే లేదని చెప్పారు.
థియేటర్లు ప్రేక్షకులు రావడం లేదు, సినిమాల నిర్మాణంలో ఇబ్బందులు వస్తున్నాయి అంటూ నిర్మాతలు గత కొన్ని రోజలుగా బంద్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అశ్వనీదత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరి ఈ విషయంలో నిర్మాతల మండలి, యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఆయన చేసిన ఓటీటీల బెడద కామెంట్, బంద్‌లు, థియేటర్ల నిర్వహణ గురించి ఏమైనా సమాధానమిస్తారేమో చూడాలి.