50 రోజుల తర్వాతే ఓటీటీలో సినిమాలు.. నిర్మాతలు పాటిస్తారా?
June 30, 2022 / 11:31 AM IST
|Follow Us
గతేడాది ఏపీ సర్కార్ టికెట్ రేట్లను తగ్గించిన సమయంలో పెద్ద సినిమాల నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్లను మార్చడంతో పాటు ఏపీ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. విచిత్రం ఏమిటంటే తక్కువ టికెట్ రేట్లు అమలులో ఉన్న సమయంలో విడుదలైన అఖండ, పుష్ప ది రైజ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రావడంతో పాటు పలు ఏరియాలలో రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఈ ఏడాది మార్చి నెల రెండో వారం నుంచి ఏపీ సర్కార్ టికెట్ రేట్లను పెంచగా టికెట్ రేట్ల పెంపు వల్ల ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు లాభపడితే ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు నష్టపోయాయి.
ఆర్ఆర్ఆర్, ఆచార్య, రాధేశ్యామ్, సర్కారు వారి పాట సినిమాలకు ఏపీ సర్కార్ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని అదనంగా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ నిర్ణయం వల్ల థియేటర్లకు రిపీట్ ఆడియన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో తగ్గింది. అదే సమయంలో పుష్ప ది రైజ్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట(రెంట్ విధానం) సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. ఈ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన మూడు వారాలకే స్ట్రీమింగ్ అయ్యాయి.
ఫలితంగా థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం నిర్మాతలు రిలీజైన 50 రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలలోకి వస్తాయని జులై 1 నుంచి ఈ విధంగా ఒప్పందాలు జరుగుతాయని చెబుతున్నారు. రాబోయే ఆరు నెలల్లో లైగర్, బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ, ఖుషి, గాడ్ ఫాదర్ మినహా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదని ఈ నిబంధన వల్ల అటు ప్రేక్షకులకు ఇటు నిర్మాతలకు పెద్దగా బెనిఫిట్ కలగదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తే నిర్మాతలు 50 రోజుల నిబంధనను పాటిస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ అంటే ఓటీటీ సంస్థలు తక్కువ మొత్తానికే డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తాయి. నిర్మాతలు 50 రోజుల నిబంధనలను పాటిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.