“అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్”కి ముందు మార్వెల్ సినిమాకి ఉన్న రీచ్ వేరు.. ఆ సినిమా తర్వాత ఆ సిరీస్ కి వచ్చిన క్రేజ్ వేరు. భాషా బేధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్న ఏకైక మూవీ సిరీస్ “అవెంజర్స్”. గగుర్పాటుకు గురి చేసే యాక్షన్ సీన్స్ తో, లెక్కకు మిక్కిలి సూపర్ హీరోస్ తో అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మోస్ట్ సక్సెస్ ఫుల్ సెరీస్ గా పేరొందిన ఈ సిరీస్ లో వచ్చిన తాజా చిత్రం “ఎవెంజర్స్ ఎండ్ గేమ్”. దాదాపు మార్వెల్ స్టూడియోస్ హీరోస్ అందరూ నటించిన ఈ చిత్రంపై ట్రైలర్ విడుదలైనప్పట్నుంచి విపరీతమైన క్రేజ్ సంపాదించుకొన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ (ఏప్రిల్ 26) విడుదలైంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం మన ఇండియన్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ: తానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ దక్కించుకొని సగం జనాభాను ధూలిగా మార్చేసి.. తన పని పూర్తయ్యింది కాబట్టి బాధతో కూడిన సంతోషంతో వేరే ప్లానెట్ కి వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా బ్రతికేస్తుంటాడు. తమ స్నేహితులను పోగొట్టుకున్న అవెంజర్స్ టీం వాళ్ళని వెనక్కి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ.. సరైన మార్గం దొరక్క ఆ మార్గం కోసం వెతుకుతూనే ఉంటారు.
సరిగ్గా అయిదేళ్ళ తర్వాత క్వాంటమ్ రియాలిటీ నుంచి బయటకి వచ్చిన “యాంట్ మ్యాన్” ధూలిగా మారిపోయిన జనాలని మరియు అవెంజర్స్ ను వెనక్కి తీసుకురావాలంటే టైమ్ ట్రావెలింగ్ ఒక్కటే మార్గమని చెబుతాడు.
ఆ ప్రకారం క్వాంటం రియాలిటీలో టైమ్ ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ ను సంపాదిస్తారు. ఈ ప్రొసెస్ జరుగుతున్న తరుణంలోనే వేరే గ్రహం మీద ఉన్న తానోస్ కి అవెంజర్స్ భవిష్యత్ కోసం చేస్తున్న ప్రయత్నం తెలిసి భూమి మీదకు వస్తాడు.
అప్పుడు అవెంజర్స్ టీం అందరూ కలిసి తానోస్ తో ఎలా పోరాడారు? చివరికి తానోస్ ను ఏం చేశారు? ఈ పోరాటంలో గెలవడం కోసం అవెంజర్స్ ఎవర్ని త్యాగం చేయాల్సి వచ్చింది? వంటి విషయాలు తెలుసుకోవాలంటే “అవెంజర్స్ ఎండ్ గేమ్”ను తప్పకుండా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: దాదాపుగా సినిమాలో నటించిన అందరూ ప్రేక్షకులకి పరిచయస్తులే అందువల్ల ఎవరి నటన గురించీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, థోర్ పాత్రలకి ఇచ్చిన అప్గ్రేడ్స్ మాత్రం వేరే లెవల్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఒక సూపర్ హీరో సిరీస్ ను విలన్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించడం అనేది ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అలాగే.. విలన్ క్యారెక్టరైజేషన్ తోనే ప్రేక్షకుల్ని మూడు గంటలపాటు మాత్రమే కాక ఎండ్ క్రెడిట్స్ కోసం కూడా థియేటర్ లోనే కూర్చోబెట్టడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. తెలుగు వెర్షన్ లో తానోస్ పాత్రకి రాణా డబ్బింగ్ బాగా యాప్ట్ అయ్యింది. పైగా ఆ పాత్ర స్వభావం రాణా వాయిస్ వల్ల ప్రేక్షకులకి ఇంకాస్త బాగా రీచ్ అయ్యిందని కూడా చెప్పొచ్చు.
సాంకేతికవర్గం పనితీరు: “మార్వెల్ సినిమా” వారి సాంకేతిక నైపుణ్యం గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమే. ఎందుకంటే సినిమా సినిమాకీ వారి సాంకేతిక పరిజ్ణానమ్ అనేది పెరుగుతూ ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేస్తుందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. పైగా.. ఈ సినిమాలో ప్రతి పాత్రను అప్గ్రేడ్ చేసిన విధానం, ప్రతి పాత్రకి ఫ్యాన్ మూమెంట్ క్రియేట్ చేసిన తీరు గురించి ఎన్నిసార్లు, ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే డైరెక్ట్ గా దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్ గురించి చెప్పుకోవాలి. వాళ్ళు కథను రాసుకొన్న విధానం కంటే, కథనాన్ని నడిపించిన తీరు ప్రశంసనీయం. ఒక విలన్ పాత్రతో కూడా ఎమోషన్ పండించవచ్చు అనే విషయాన్ని అద్భుతంగా ప్రూవ్ చేశారు. సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క వీక్ మూమెంట్ కూడా లేకుండా.. సినిమాలో ఉన్న అందరూ హీరోలకు సమానమైన ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించడం అంటే సాహసమానే చెప్పాలి.
అందుకే వాళ్ళ టెక్నికల్ బృలియన్స్ కంటే కథకులుగా వారి సాహసాన్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎవరూ ఎక్స్ ఫెక్ట్ చేయని విధంగా క్లైమాక్స్ ను డిజైన్ చేయడంతోపాటు.. ఎమోషన్ ను క్యారీ చేసిన విధానం అద్భుతం. సినిమాలో దాదాపు 22 మంది హీరోలకంటే ఎక్కువగా ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యేది విలన్ తానోస్ పాత్రకి. ఆ పాత్ర మనకి రామాయణంలోని రావణాసురుడిని తలపిస్తుంది. విజయ గర్వం కంటే బాధ ఎక్కువగా కనిపిస్తుంది అతడి స్వభావంలో. అలాగే.. విజయానికంటే ఎక్కువగా బంధాలకు విలువనిచ్చే అతడి క్యారెక్టర్ ఆడియన్స్ ను ఎమోషనల్ గా ఇన్వాల్వ్ చేస్తుంది.
ఐరన్ మ్యాన్, బ్లాక్ విడో పాత్రలకు వీడ్కోలు పలికిన తీరు.. వారి పాత్రల ఔన్నిత్యాన్ని పెంచింది. సదరు సన్నివేశాల్లో తప్పకుండా ప్రేక్షకులందరి కళ్ల వెంబడి కన్నీరు రావడం ఖాయం.
విశ్లేషణ: ఒక సినిమా చూసి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం అనేది ఎప్పుడో కానీ జరిగే విషయం కాదు. అలాగే ఎమోషనల్ గా ఆడియన్స్ ను మూడు గంటలపాటు థియేటర్ లో కూర్చోబెట్టడం అనేది కూడా కేవలం “ఎవెంజర్స్” చిత్రానికే సాధ్యమైంది. సో, యాక్షన్ మూవీ లవర్స్ కి మాత్రమే కాదు ప్రతి మూవీ లవర్ తప్పకుండా చూడాల్సిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఎవెంజర్స్ ఎండ్ గేమ్”.