బాహుబలి 2 ఆంధ్ర థియేటర్ హక్కులను సొంతం చేసుకున్న సాయి కొర్రపాటి
October 28, 2016 / 09:54 AM IST
|Follow Us
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అపూర్వ సృష్టి “బాహుబలి : బిగినింగ్” రిలీజ్ తర్వాత రికార్డులను నెలకొల్పగా… ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ విడుదలకు ముందే చరిత్రను లిఖిస్తోంది. మొన్న 40 కోట్లు చెల్లించి అమెరికా థియేటర్ హక్కులను ఓ సంస్థ సొంతం చేసుకుంది. నిన్న నైజాం(తెలంగాణ) ఏరియా హక్కులను ఏషియన్ ఎంటర్ ప్రయిజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 50 కోట్లకు దక్కించుకున్నారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ థియేటర్ హక్కులను నిర్మాత సాయి కొర్రపాటి భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. సీడెడ్ (రాయల సీమ) థియేటర్ హక్కులను కొన్ని రోజులక్రితమే 25 కోట్లకు కొన్న సాయి, తాజాగా ఉత్తరాంధ్ర, కృష్ణ ఏరియా హక్కులను 25 (15 +10) కోట్లకు కొన్నట్లు తెలిసింది. ఇక నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ చిత్రం హక్కులకోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు. ఈ ఏరియాల్లో మొత్తం మరో 30 కోట్లు ధర పలుకుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. అంటే బాహుబలి కంక్లూజన్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి ముందే దాదాపు 130 కోట్ల బిజినెస్ చేసినట్లు. మరి వచ్చే ఏడాది ఏప్రిల్ 28 తర్వాత ఈ అంకెలు ఎంత వరకు పరుగులు తీస్తాయో చూడాలి.