తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిభను ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన అద్భుత కళాఖండం విడుదలైన చోటల్లా జేజేలు అందుకుంటోంది. జాతీయ అవార్డు తో బాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న బాహుబలి – కంక్లూజన్ చిత్రాన్ని జక్కన బృందం మరింత భారీగా తెరకెక్కిస్తోంది. కేవలం సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ కోసమే 30 కోట్లను వెచ్చించారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్ లో కొన్ని రోజులుగా యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ షూటింగ్లో 5000 వేల మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ఇంతమంది సినిమా షూటింగ్ లో పాల్గొనడం ఏ చిత్ర చరిత్రలో లేదు.
బాహుబలి – బిగినింగ్ పోరాట సన్నివేశాల్లో 1000 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. అంతమందిని కంట్రోల్ చేస్తూ సినిమా చేయడమే గొప్పగా భావించారు. ఇప్పుడు 5000 మందితో రాజమౌళి షాట్స్ తీస్తున్నారు. గత చిత్రం కంటే ఐదు రెట్ల మందితో మరింత గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. బాహుబలి రెండో భాగం మొదటి దాని కంటే ఐదు రెట్లు గొప్పగా ఉంటుందనడంలో సందేహం అవసరం లేదని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది.