Bollywood Movies: ఈ ఫ్లాప్ ల నుంచి బాలీవుడ్ బయటపడుతుందా..?
May 16, 2022 / 02:23 PM IST
|Follow Us
సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రచ్చ చేస్తుంటే.. హిందీ సినిమాలు మాత్రం దారుణమైన ఫలితాలను అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో ఒక్క ‘ది కశ్మీర్ ఫైల్స్’ మినహా ఏ బాలీవుడ్ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, అజయ్ దేవగన్, జాన్ అబ్రహం లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ’83’, ‘రన్ వే 34’, ‘బచ్చన్ పాండే’ సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఫలితం లేకుండా పోయింది.
నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఎటాక్’ సినిమా అడ్రెస్ లేకుండా పోయింది. పెద్ద సినిమాలకు సరైన ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. ‘రన్ వే 34’, ‘ఎటాక్’ సినిమాలకు రూ.3 నుంచి 4 కోట్ల మధ్య వసూళ్లు రావడం అక్కడి ట్రేడ్ పండిట్ లకు సైతం షాకిచ్చింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా చేరింది. అదే ‘జయేష్ భాయ్ జోర్దార్’. యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి భారీ బ్యానర్ లో రణవీర్ సింగ్ లాంటి పెద్ద హీరో నటించిన సినిమా ఇది.
బాలీవుడ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న సమయంలో ఈ సినిమా ఏమాత్రం ప్రభాస్మ్ చూపిస్తుందోనని ముందే సందేహాలు కలిగాయి. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్ కూడా కనిపించలేదు. సరైన బజ్ లేకుండా ఈ సినిమా విడుదలైంది. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి పెద్ద షాకే తగిలింది. తొలిరోజు ఈ సినిమా రూ.3 కోట్ల వసూళ్లను సాధించింది.
గతంలో రణవీర్ నటించిన ‘సింబా’ సినిమా తొలిరోజు రూ.20 కోట్ల వసూళ్లను రాబడితే.. ఇప్పుడు ‘జయేష్ భాయ్ జోర్దార్’ కేవలం మూడు కోట్లే రాబట్టిదంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. స్టార్ ఇమేజ్ కూడా వర్కవుట్ కాకపోవడం, రోజురోజుకి కలెక్షన్స్ పడిపోవడంతో బాలీవుడ్ మరింత కలవరపడుతోంది.