ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హవా పెరిగిన తరువాత ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను ఆదరిస్తుండడంతో.. ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ మీద బాగా దృష్టి పెడుతున్నారు. మన దర్శకనిర్మాతలు సైతం బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
గీతాఆర్ట్స్ బ్యానర్ లో ‘ప్రతిబంధ్’ నుంచి ‘గజినీ’ వరకు చాలా సినిమాలను నిర్మించారు. అశ్వనీదత్, మధు మంతెన, ఠాగూర్ మధు లాంటి ఇతర నిర్మాతల భాగస్వామ్యంతో ప్రొడక్షన్ చేశారు. అప్పుడెప్పుడో ‘గజినీ’ రీమేక్ తరువాత బాలీవుడ్ లో గ్యాప్ తీసుకున్న అల్లు అరవింద్.. దాదాపు 14 ఏళ్ల తరువాత ‘జెర్సీ’ రీమేక్ తో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చారు. ఈ రీమేక్ లో దిల్ రాజు, నాగవంశీ భాగస్వామ్యం కూడా ఉంది.
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జెర్సీ’ బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాలో నటించినప్పటికీ.. సినిమా డిజాస్టర్ అయింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ‘షెహజాదా’ అనే సినిమాను నిర్మించారు అల్లు అరవింద్. ఇది తెలుగులో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాకి రీమేక్. ‘షెహజాదా’కు అల్లు అరవింద్ తో పాటు గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఎస్ రాధాకృష్ణ, అమన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ సినిమా కూడా బాలీవుడ్ లో డిజాస్టర్ అయింది. ఇక దిల్ రాజు అయితే తెలుగులో సక్సెస్ అయిన ‘హిట్’ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. బాలీవుడ్ లో సక్సెస్ కావాలనుకున్న టాలీవుడ్ అగ్ర నిర్మాతలకు అక్కడ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మరి ఫ్యూచర్ లోనైనా.. మన నిర్మాతలు అక్కడ బాలీవుడ్ లో సక్సెస్ అవుతారేమో చూడాలి!