‘గున్న మామిడి కొమ్మ మీద’ సాంగ్ ఈ సినిమాలోనిదే.. 50 ఏళ్ల ‘బాల మిత్రుల కథ’గురించి ఆసక్తికర విషయాలు..!
March 1, 2023 / 09:20 PM IST
|Follow Us
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాల్య స్నేహితుల నేపథ్యంలో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.. బాల్యం,స్నేహం, విద్య వంటి అంశాలతో చక్కని సందేశాన్నిస్తూ తెరకెక్కిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకాదరణ పొందాయి.. వాటిలో ‘బాల మిత్రుల కథ’ చిత్రాన్నిది ప్రత్యేక స్థానం.. 1973 మార్చి 1న విడుదలైన ఈ అద్భుతమైన చిత్రం 2023 మార్చి 1 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
ప్రాణ స్నేహితులైన ధర్మయ్య (మాస్టర్ దేవానంద్), సత్యం (మాస్టర్ సురేంద్ర) ఈ సినిమాకి హీరోలు.. భవానీ ప్రసాద్ (జగ్గయ్య)కి వీరు అభిమాన విద్యార్థులు.. ధర్మయ్య కూలీ కోటయ్య (గుమ్మడి) కొడుకు.. సత్యం ధనవంతుడైన భూషయ్య (మిక్కిలినేని) కుమారుడు.. వీరి స్నేహంతో పాటు అనుకోకుండా జరిగిన పొరపాట్లు.. వాటి పర్యావసనాలు.. పరిష్కార మార్గాలు.. ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతుంది ‘బాల మిత్రుల కథ’.. బాలనటులైనా కానీ తమ నటనతో ప్రేక్షకులను కట్టి పడేశారు దేవానంద్, సురేంద్ర.. ప్రత్యేకపాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కనిపించారు..
అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, రాజబాబు, నాగభూషణం, చలపతి రావు, జయ కుమారి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.. గౌరి శేషు కంబైన్స్ బ్యానర్ మీద ఎస్.వి. నరసింహ రావు నిర్మించగా.. కె. వర ప్రసాద రావు దర్శకత్వం వహించారు.. సత్యం అందించిన పాటలు ప్రధానాకర్షణ.. ఉన్న మూడు పాటలూ సి. నారాయణ రెడ్డి రాశారు.. ఎస్. జానకి అద్భుతంగా పాడిన ‘గున్న మామిడి కొమ్మ మీద’ పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది.. తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ సాంగ్ ఇది..
యూట్యూబ్ తెలుగు బ్లాక్ & వైట్ చిత్ర చరిత్రలోనే అత్యధిక సార్లు వీక్షకులు చూసిన పాట (46 మిలియన్ వ్యూస్ ప్రస్తుతం) గా రికార్డ్ నెలకొల్పింది.. ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన ‘పుట్ట మీద పాల పిట్టోయ్’.. ఎస్. జానకి, ఎస్పీ బాలు పాడిన ‘రంజు భలే రామ చిలుకా’ ఆకట్టుకుంటాయి.. ఆది విష్ణు ఆకట్టుకునే సంభాషణలు రాయగా.. విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించారు.. 50 సంవత్సరాలు కాదు.. మరో 50 ఏళ్లైనా మర్చిపోలేని అపురూప చిత్రం ఈ ‘బాల మిత్రుల కథ’..