Balayya Babu: యోగా డే స్పెషల్.. బాలయ్య యోగాసనాల ఫోటోలు వైరల్..!
June 21, 2022 / 05:31 PM IST
|Follow Us
ఈరోజు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’. అందుకే సెలబ్రిటీలు అంతా యోగాసనాలు వేసిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసి హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ లిస్ట్ లో ప్రధాని నరేంద్ర మోదీ… మన బాలయ్య వరకు చాలా మంది స్టార్లు ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యే, స్టార్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ ప్రతి సంవత్సరం ‘యోగా డే’ ని పురస్కరించుకుని యోగాసనాలు వేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆయన యోగాసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
హైదరాబాద్ లోని… బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన యోగా వేడుకలకు హాజరైన బాలయ్య మాట్లాడుతూ.. “యోగాభ్యాసం మనిషి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. యోగాను నియమం తప్పకుండా అభ్యాసం చేయాలి. ప్రపంచమంతా యోగాను అంగీకరించడం మన సంస్కృతికి దక్కిన గౌరవం. 15 దేశాలతో మొదలు పెట్టి… ప్రస్తుతం 175 దేశాల్లో యోగా దినోత్సవం అనేది విస్తరించింది. మన రుషులు, యోగా గురువుల గొప్పతనాన్ని ప్రపంచమంతా అంగీకరించి గౌరవాన్ని ఇచ్చారు.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకి ప్రాధాన్యతనిస్తున్నాయి. పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారం ఎంతో ప్రయోజనకరమైనది.. లక్ష్య సిద్ధి ప్రజలు ఆ మార్గాన్ని అనుసరించాలి. దేశ ప్రజలందరికీ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలయ్య యోగాసనాలు వేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్న బాలయ్య అటు తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘బ్రో ఐ డోంట్ కేర్'(ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం చేయబోతున్నాడు. అలాగే ‘ఆహా’ వారి ‘అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్’ ను కూడా హోస్ట్ చేయబోతున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్య యోగాసనాల ఫోటోలు, వీడియోలను ఓ లుక్కేయండి :