‘నర్తనశాల’ తో పాటు ఆ రెండు చిత్రాలను కూడా ఓటిటిలోలోనే ప్లాన్ చేస్తున్న బాలయ్య..!
October 29, 2020 / 06:51 PM IST
|Follow Us
షూటింగ్ మధ్యలో ఆగిపోయినప్పటికీ.. ‘నర్తనశాల’ 17 నిమిషాల ఫుటేజ్ ను ఏటీటీ ద్వారా విడుదల చేసి కొత్త ట్రెండ్ సృష్టించాడు బాలయ్య. దివంగత సౌందర్య, శ్రీహరి.. ల ఆఖరి చిత్రం కావడం.. అందులోనూ బాలయ్య డైరెక్షన్లో రూపొందిన చిత్రం కావడంతో.. 17 నిమిషాల ఫుటేజ్ అయినప్పటికీ బుకింగ్స్ బాగానే జరిగాయి. ‘ఎన్.బి.కె.థియేటర్స్’ మరియు ‘శ్రేయాస్ ఏటీటీ’ లో విడుదలైన ఈ చిత్రం .. రూ.1.25 కోట్ల వరకూ లాభాలను అందించింది. దీంతో బాలకృష్ణ హీరోగా మొదలై.. విడుదలవ్వకుండా ఆగిపోయిన మరో రెండు చిత్రాలను కూడా ఇప్పుడు ఓటిటిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.
వివరాల్లోకి వెళితే.. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య హీరోగా ‘విక్రమసింహ భూపతి’ అనే చిత్రం మొదలయ్యింది. నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్లో ఎనిమిదవ చిత్రంగా ప్రారంభమైన ’విక్రమసింహ భూపతి’.. 80శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.అయితే ఈ చిత్రం నిర్మాత అయిన ఎస్.గోపాల్ రెడ్డిగారి మరణంతో మధ్యలో ఆగిపోయింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రోజా, పూజా బాత్రా హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో రాబోతున్న ఆఖరి చిత్రం ఇదే అవుతుంది కాబట్టి.. కచ్చితంగా ‘విక్రమసింహ భూపతి’ బాగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఎన్టీఆర్ డైరెక్షన్లో రూపొందిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రం హిందీ వెర్షన్ ను కూడా ఓటిటిలో విడుదల చెయ్యబోతున్నారు. తెలుగులో ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో.. హిందీలో విడుదల చెయ్యలేదు సీనియర్ ఎన్టీఆర్. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్లో మన జూ.ఎన్టీఆర్ కూడా నటించాడు. కాబట్టి ఈ చిత్రం పై కూడా మంచి హైప్ ఏర్పడే అవకాశం ఉంది.