ఆకాష్ పూరి హీరోగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చోర్ బజార్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జూన్ 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా బండ్ల గణేష్ వచ్చాడు. అతను మైక్ పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఈ ఈవెంట్ లో కూడా అదే జరిగింది.
ఆయన మాట్లాడుతూ “నేను దూరంగా ఉంటే మా వదిన(పూరి భార్య లావణ్య) ఫోన్ చేసింది ఫంక్షన్ కి రావాలని. నేను ఈ ఫంక్షన్ కి వచ్చింది నా వదిన కోసం. మా వదిన అంటే నాకు ఎంతో ఇష్టం. ఒక అమ్మ ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా ఉండాలి, ఒక అక్క ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా, ఒక భార్య ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా ఉండాలి. సీతా దేవిని నేను చూడలేదు కానీ సీతా దేవికి ఉన్నంత ఓపిక ఉంది ఆవిడకి. సీతా దేవికి ఉన్నంత సహనం ఉంది ఆవిడకి. కర్ణుడిని కన్న కుంతీదేవికి ఉన్నన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి ఆవిడకి. నేను నా తల్లిని ఎంత గౌరవిస్తానో.. ఆవిడని కూడా అంత గౌరవిస్తాను.నేను పూరితో రెండు సినిమాలు తీసాను.
ఆయన సాధించిన సక్సెస్ లలో ఆమెకు కూడా షేర్ ఉంటుంది. ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ లు వస్తుంటాయి… పోతుంటాయి. కానీ అమ్మ శాశ్వతం. జీవితాంతం ఆవిడని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఆకాష్ ది,పూరి అన్నది.. పవిత్ర ది..! ఆమెకు నా మనస్ఫూర్తిగా పాదాభి వందనాలు చేస్తున్నాను. పూరి గారు పెద్ద డైరెక్టర్ అవుతాడు… భూమి బద్దలు కొడతాడు.. ఇండస్ట్రీని దొబ్బేస్తాడు..అని పెళ్లి చేసుకోలేదు ఆవిడ. ఆయన జేబులో రెండు వందలు ఉన్నాయి అని చెప్పినా వచ్చి సనత్ నగర్ గుడిలో పెళ్లి చేసుకుంది.పూరి సక్సెస్ అయ్యాక చాలా మంది స్టార్లు వచ్చారు. కానీ ముందుగా వచ్చింది ఆమెనే…! ఇక ఓ సామెత ఉంటుంది. దేశమంతా కళ్ళాపు జల్లాడు కానీ ఇంటి ముందు కళ్ళాపు జల్లడానికి టైం లేదు ఆయనకి(పూరికి).ఎవరెవరినో స్టార్లని చేసావ్.. డ్యాన్స్ లు రాని వాళ్లతో డ్యాన్స్ లు చేయించావ్, డైలాగులు చెప్పడం రాని వాళ్ళతో డైలాగులు చెప్పించావ్.
ఇంకా ఎంతో మందికి స్టార్లని చేసావ్, సూపర్ స్టార్లని చేసావ్. నీ కొడుకు సినిమాకి వచ్చేసరికి ఎక్కడికో వెళ్లి కూర్చున్నావు.ఇది నా కొడుకు సినిమా ఫంక్షన్ అయ్యి ఉంటే కనుక నేను స్పెషల్ ఫ్లైట్ వేయించుకుని మరీ వచ్చేవాడిని. మనం ఎంత సంపాదించినా వాళ్ళ కోసమే. మనం పోతే తలకొరివి పెట్టాల్సింది వాళ్ళే.మనం పోతే మన అప్పులు తీర్చాల్సింది వాళ్ళే. వాళ్ళ తర్వాతే ఎవరైనా. నీ కొడుకు విషయంలో ఎందుకు ఇలా చేసావ్.ఇది కరెక్ట్ కాదు. అరేయ్ ఆకాష్ నువ్వు స్టార్ హీరో అయ్యాక నువ్వు మీ నాన్నతో సినిమా చేయకు. కథ చెప్పడానికి వచ్చినా వెయిట్ చేయించు.
నీ కొడుకు సినిమా ఫంక్షన్ కు వచ్చే టైం లేదా నీకు. పోనీ మిగిలిన హీరోలు వచ్చి ఈ సినిమాకి సాయం చేసారా చేయరు. వీడు స్టార్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కాబట్టి రాడు. ఆకాష్ కచ్చితంగా స్టార్ అవుతాడు. ‘చోర్ బజార్’ చిత్రం మా వదిన కోసం సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను” అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ‘ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ లు వస్తుంటాయి… పోతుంటాయి’ ఈ డైలాగ్ ఛార్మిని ఉద్దేశించి బండ్ల గణేష్ అన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలందరి పై కూడా బండ్ల సెటైర్ల వర్షం కురిపించడం గమనార్హం. ‘చోర్ బజార్’ రిలీజ్ వరకు ట్రెండ్ అవ్వడానికి ఈ ఒక్క స్పీచ్ సరిపోతుంది అనడంలో సందేహం లేదు.