Vijay Devarakonda: బెంగళూరులో ‘లైగర్’కి షాక్ ఇచ్చిన యువతి
August 23, 2022 / 12:40 PM IST
|Follow Us
అభిమాన హీరో ఎదురుపడితే.. మాట్లాడేంత దగ్గరలో ఉంటే మాట్లాడేస్తాం, లేదంటే సెల్ఫీ అడిగి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి మురిసిపోతాం. అయితే ఓ అమ్మాయి ఏకంగా ఉంగరం తొడిగేసి ప్రపోజ్ చేసేస్తే.. ఆ హీరో కచ్చితంగా షాక్ అవుతాడు. అయితే ఆ హీరో కుర్రకారు హార్ట్ థ్రోబ్ అయితే.. అలాంటివి పెద్ద విషయం కాదు. అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండకి. ‘లైగర్’ సినిమా ప్రచారంలో భాగంగా ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడు.
‘లైగర్’ సినిమా ప్రచారం కోసం విజయ్ దేవరకొండ ఇటీవల బెంగళూరు వెళ్లాడు. అక్కడ వీడియో ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో తేజశ్రీ అనే యువతి వచ్చి… విజయ్‌తో మాట్లాడటానికి ప్రయత్నించింది. తన కోసం వచ్చేవాళ్లను దగ్గరకు పిలిచి మాట్లాడి, పంపించడం విజయ్‌కి ఉన్న అలవాటు. గతంలో కొన్నిసార్లు మనం ఇలాంటివి చూశాం కూడా. అలానే తేజశ్రీని కూడా పిలిచాడు. అయితే ఆమె వచ్చి రావడం, విజయ్‌కి ఓ ఉంగరం తొడిగేసి ప్రపోజ్ చేసేసింది.
దీంతో కాస్త షాక్ అయిన విజయ్.. అయినా ఇలాంటివి నాకు మామూలే అనుకుంటూ.. ఆమెకు ఓ చిన్న హగ్ ఇచ్చి, అనునయించి పంపించేశాడు. వెళ్లిపోతున్నప్పుడు తనదైన శైలిలో ‘బాయ్ తేజు’ అని అన్నాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత తేజశ్రీ అక్కడ జరిగిన మొత్తం విషయాలను ట్విటర్లో రాసుకొచ్చింది. దీంతో ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రౌడీ’ హీరో సూపర్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ కనిపించేసరికి తేజశ్రీకి భావోద్వేగంతో కన్నీళ్లు ఆగలేదట. అంతే, తన వెంట తెచ్చుకున్న ఉంగరాన్ని విజయ్ వేలికి తొడిగి, ఎవరి దిష్టి తగలకూడదంటూ మోకాలిపై నిలబడి ప్రపోజ్ చేసేసింది. అయితే విజయ్, ఆ ఉంగరం వెంటనే తీసేయకుండా ‘లైగర్’ సినిమా ప్రచారం జరిగే అన్ని రోజులూ ఆ ఉంగరం ధరిస్తానని మాటిచ్చాడట. అన్నట్లు ‘లైగర్’ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. అనన్య పాండే నాయికగా నటించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు.