Chatrapathi Remake: ‘ఛత్రపతి’ రీమేక్ కి ఓటీటీ ఆఫర్!
February 13, 2023 / 12:53 PM IST
|Follow Us
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు రొటీన్ గా ఉన్నా.. కమర్షియల్ గా వర్కవుట్ అవుతాయని నిర్మాతలు ముందుకొస్తుంటారు. తమిళ ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసి పెద్ద హిట్ అందుకున్నారు బెల్లంకొండ. ఆ తరువాత అతడు నటించిన ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా డిజాస్టర్ అయింది. అప్పటినుంచి ఈ యంగ్ హీరో తెలుగులో మరో సినిమా చేయలేదు. బాలీవుడ్ ఎంట్రీ కోసం ‘ఛత్రపతి’ రీమేక్ ఒప్పుకున్నారు.
ఈ సినిమాపై దృష్టి పెట్టాలని ముంబైకి షిఫ్ట్ అయ్యారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. షూటింగ్ అవుతుందా..? పూర్తయిందా..? అనే విషయాలు కూడా బయటకు చెప్పలేదు. నార్త్ మీడియా రాస్తోన్న కథనాల ప్రకారం.. ‘ఛత్రపతి’ రీమేక్ ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నారట.
థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరిగే సూచనలు లేకపోవడం, పెట్టిన ఖర్చుకి వచ్చే రాబడికి మధ్య వ్యత్యాసం ఉండేలా కనిపించడంతో ఫైనల్ గా డిజిటల్ రిలీజ్ కే మొగ్గు చూపించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ని మీడియాతో షేర్ చేసుకోవడం లేదట. డీల్ ఫైనల్ అయిన తరువాత అప్పుడు పూర్తి వివరాలు బయట పెడతారని తెలుస్తోంది. బెల్లంకొండ సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయగా..
మిలియన్ల వ్యూస్ ను రాబట్టాయి. బాలీవుడ్ లో సినిమా చేస్తే తన రేంజ్ పెరుగుతుందని భావించి.. ‘ఛత్రపతి’ రీమేక్ ని ఎన్నుకున్నారు బెల్లంకొండ. దీనికోసం మూడేళ్ల కాలం వెచ్చించారు. ఒకవేళ ఈ సినిమా గనుక ఓటీటీలో వస్తే.. బెల్లంకొండకి కలిసొచ్చేదేమీ ఉండదు. హీరోల ఇమేజ్ ని థియేటర్ రెవెన్యూ ఆధారంగా అంచనా వేసే ఈ ఇండస్ట్రీలో సినిమా వెండితెరపైకి వస్తేనే సత్తా తెలుస్తుంది. అలా చూసుకుంటే బెల్లంకొండ ఈ సినిమా కోసం పడిన కష్టమంతా వృథా అయినట్లేనా..?