2023 Rewind: 2023లో తమ నటనతో ఆకట్టుకున్న కథానాయకులు
January 2, 2024 / 05:00 PM IST
|Follow Us
సాదారణంగా బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో ఎప్పుడూ స్టార్ హీరోలు మాత్రమే ఉంటారు. కానీ.. 2023లో మాత్రం స్టార్ హీరోలు మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మరియు యువ కథానాయకులు కూడా ఉన్నారు. ఈ లిస్టులో కొన్ని పేర్లు ఆనందాన్ని, మరికొన్ని పేర్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవేమిటో చూద్దాం..!!
1. ధనుష్ – సార్
ధనుష్ ను కొత్తగా స్టార్ పెర్ఫార్మర్ లేదా బెస్ట్ యాక్టర్ అని చెప్పనక్కర్లేదు. కానీ.. “సార్” చిత్రంలో అతడి నటన చూశాక తెలుగు ప్రేక్షకులకు అతడి స్టామినా ఇంకాస్త స్పష్టంగా అర్ధమైంది. పిల్లలను చదివించడం కోసం తపనపడే స్కూల్ టీచర్ గా ధనుష్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా మారాజయ్యా పాటలో అతడి హావభావాలు మనసుకి హత్తుకుంటాయి.
2. నాని – దసరా & హాయ్ నాన్న
వరుసగా మూస ధోరణిలో సినిమాలు చూసుకుంటూ వస్తున్న నాని.. ఒక్కసారిగా గేరు మార్చి తన స్థాయిని ఘనంగా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో విడుదలైన “దసరా”, చివర్లో వచ్చిన “హాయ్ నాన్న”లో లుక్స్ మొదలుకొని.. బాడీ లాంగ్వేజ్ వరకూ నాని చూపిన వేరియేషన్ కు ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇక నాని తదుపరి చిత్రం “సరిపోదా శనివారం” మీద మంచి అంచనాలున్నాయి.
3. ప్రియదర్శి – బలగం
బలగం సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ.. ఈ సినిమాలో పెళ్లి కోసం పరితపించే యువకుడిగా, తాతయ్య కోసం ఆరాటపడే మనవడిగా ప్రియదర్శి కనబరిచిన నటన అందర్నీ అలరించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన తప్పు తెలుసుకొని ఏడ్చే సన్నివేశంలో ప్రియదర్శి అందరి చేత కన్నీరు పెట్టించాడు. కేవలం కామెడీ లేదా సైడ్ యాక్టర్ రోల్స్ కి పరిమితం అయిపోకుండా.. ప్రియదర్శి మధ్యమధ్యలో ఇలాంటి రోల్స్ చేస్తే నటుడిగా అతడి స్థాయి పెరుగుతుంది.
4. బ్రహ్మానందం – రంగమార్తాండ
బ్రహ్మానందం అంటే కమెడియన్ గా మాత్రమే తెలుసు జనాలకి. కానీ.. ఆయనలోని అద్భుతమైన నటుడ్ని నవతరం ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం “రంగమార్తాండ”. హాస్పిటల్ బెడ్ మీద ఆయన చేసిన ఏకపాత్రాభినయం చూసి ఆశ్చర్యచకితుడవ్వని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఇదిరా బ్రహ్మానందం రేంజ్ అని ఆయన అభిమానులందరూ గర్వంగా చెప్పుకొనేలా చేసిన పాత్ర అది.
5. సంతోష్ శోభన్ – అన్నీ మంచి శకునములే
ఒక మంచి హిట్ కోసం దండయాత్రలు చేస్తున్న హీరో సంతోష్ శోభన్. నటుడిగా మాత్రం ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని నాసిరకం సినిమాలు చేసినప్పటికీ.. “అన్నీ మంచి శకునములే” చిత్రంలో అతడి నటన విశేషంగా ఆకట్టుకుంటుంది. తండ్రి అంచనాలను అందుకోలేక బ్రతికే కొడుకుగా అతడు పాత్రను పోషించిన తీరు ప్రశంసనీయం.
6. ఆనంద్ దేవరకొండ – బేబీ
విజయ్ దేవరకొండ తమ్ముడు, బుల్లికొండ అని అందరు ముద్దుగా పిలుచుకొనే ఆనంద్ దేవరకొండ ఇప్పటివరకూ పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. నటుడిగా మెప్పించలేకపోయాడు. అయితే.. “బేబీ”లో నవతరం యువకుడిగా, చివర్లో భగ్న ప్రేమికుడిగా అతడి నటనకు ప్రేక్షకులు భీభత్సంగా కనెక్ట్ అయ్యారు. ఆటో డ్రైవర్లైతే దేవరకొండ పాత్రలో తమను తాము చూసుకున్నారు.
7. నవీన్ పోలిశెట్టి – మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
సినిమా మొదలైన 20 నిమిషాల వరకూ కనిపించడు నవీన్ పోలిశెట్టి. అప్పటివరకూ చాలా చప్పగా సాగిన కథనం, నవీన్ ఎంట్రీతో ఒక్కసారిగా ఊపందుకుంటుంది. స్టాండప్ కమెడియన్ గా నవీన్ పంచులు, కామెడీ టైమింగ్ & స్క్రీన్ ప్రెజన్స్ “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా పెద్ద హిట్ అవ్వడంలో కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. అలాగే.. ఎమోషనల్ సీన్స్ లోనూ తన సత్తాను చాటుకున్నాడు నవీన్.
8. బాలకృష్ణ – భగవంత్ కేసరి
భగవంత్ కేసరి బాలయ్యలోని మరో కోణాన్ని పరిచయం చేసింది. తెలంగాణ యాసలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య నటన మాస్ ఆడియన్స్ ను మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రీలీలకు తండ్రి సమానుడిగా బాలయ్య ఒదిగిపోయిన తీరుపై అభినందనల జల్లు కురిసింది.
9. ప్రభాస్ – సలార్
అసలు ప్రభాస్ (Prabhas) అంటేనే అందరికీ ముందు గుర్తొచ్చేది “కటౌట్”. ఆ కటౌట్ ను సరిగ్గా వాడుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ చిత్రంలో ప్రభాస్ నటన, బాడీ లాంగ్వేజ్ & స్క్రీన్ ప్రెజన్స్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాయి. అన్నిటికంటే ముఖ్యంగా.. ఎక్కువ డైలాగ్స్ లేకుండా చాలా సింపుల్ గా ప్రభాస్ చెప్పే “పగిలిందా?, రెండు నిమిషాలు ఉంటే దొరలా రెడీ చేస్తాను” అంటూ సెటిల్డ్ గా చెప్పే మాస్ ఎలివేషన్ డైలాగ్స్ అద్భుతంగా పేలాయి.
10. శ్రీవిష్ణు – సామజవరగమన
మంచి కామెడీ టైమింగ్ ఉన్న అతి తక్కువ కథానాయకుల్లో శ్రీవిష్ణు ఒకడు. అతడి టైమింగ్ ను ఆల్రెడీ “బ్రోచేవారెవరు, మెంటల్ మదిలో” వంటి సినిమాల్లో చూసేశామ్. కానీ.. “సామజవరగమన”లో (SriVishnu) శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ మరో లేవల్లో ఉంటుంది. ప్రతి పంచు, ప్రతి ఎక్స్ ప్రెషన్ భీభత్సంగా వర్కవుటయ్యాయి.