నవీన్ చంద్ర-సలోని లుత్రా టైటిల్ పాత్రల్లో నటించిన వెబ్ ఫిలిమ్ “భానుమతి & రామకృష్ణ”. శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ నుండి ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ ముదర వయసు ప్రేమకథ ఎలా ఉందో చూద్దాం..!!
కథ: తెనాలికి చెందిన 33 ఏళ్ల మంచి యువకుడు రామకృష్ణ (నవీన్ చంద్ర). విజయవాడకు చెందిన 30 ఏళ్ల ఆధునిక యువతి భానుమతి (సలోని లూత్రా). ఈ ఇద్దరు హైద్రాబాద్ లో ఒకే కంపెనీలో పనిచేస్తుంటారు. లండన్ లో చదువుకున్న భానుమతి మోడ్రన్, ఇండిపెండెంట్ ఉమెన్ అనే పదానికి నిలువెత్తు ఉదాహరణలా ఉంటుంది. ఇక రామకృష్ణ ఏమో మంచితనానికి ఫ్యాంట్-షర్ట్ వేసినట్లు ఉంటాడు. ఈ ఇద్దరి నడుమ చిగురించిన ప్రేమ చివరికి ఏ తీరానికి చేరింది? మధ్యలో వచ్చిన ఈగో ఇష్యూస్ ను ఈ మెచ్యూర్డ్ కపుల్ ఎలా అధిగమించారు అనేది ఆహా యాప్ లో ఈ 92 నిమిషాల సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: ఇప్పటివరకూ నవీన్ చంద్ర అంటే ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, మంచి హీరో మెటీరీయల్ అన్నట్లుగానే చూపించారు కానీ.. అతడిలోని నటుడ్ని మాత్రం ఎవరూ పెద్దగా వినియోగించుకోలేదు. దర్శకుడు శ్రీకాంత్ కి అదే ప్లస్ అయ్యింది. ఇప్పటివరకు నవీన్ చంద్రలో చూడని సరికొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. పాపిడి దువ్వుకొని, బొట్టు పెట్టుకొని ఓ సగటు అమాయకుడిగా నవీన్ చంద్ర పాత్ర భలే ఉంటుంది. ప్రెజంట్ యంగర్ జనరేషన్ కి అతడి పాత్ర విచిత్రంగా అనిపిస్తుంది కానీ.. ఇంట్లో అమ్మలకి, బామ్మలకి మాత్రం “రాముడు మంచి బాలుడు” ఇమేజ్ బాగా నచ్చుతుంది.
ఇక మన భారతీయ జీవన విధానంలో అమ్మాయి అంటే అణిగిమణిగి ఉండాలి అని మనం రాసుకున్న రూల్స్ కి పూర్తి విరుద్ధంగా ఉంటుంది భానుమతి పాత్ర. ఆమె క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేసిన విధానం ఎంత బాగుందో.. ఆ పాత్రను సలోని పోషించిన విధానం కూడా అంతే అందంగా ఉంది. వైవా హర్ష పంచులు నవ్విస్తాయి, అప్పాజీ అంబరీష్ పోషించిన తండ్రి పాత్రలో మెచ్యూరిటీ బాగుంది.
సాంకేతికవర్గం పనితీరు: 30 అంటే ముదురు అనడానికి ప్రాస కుదిరిందో లేక 30 ఏళ్ళు దాటితే పెళ్లి వయసు దాటిపోయినట్లే అని భారత ప్రభుత్వం జీవో జారీ చేసిందో తెలియదు కానీ.. 30 ఏళ్ళు దాటిన అమ్మాయి, అబ్బాయి పెళ్ళికి పనికిరానివాళ్ళుగా చూస్తారు మన భారతీయులు. అబ్బాయి అయితే కాస్త కనికరిస్తారు కానీ.. అదే అమ్మాయి 30 ఏళ్ళు దాటిగా పెళ్లి చేసుకోలేదంటే మాత్రం ఆమెకు ఇక పెళ్లి అవ్వదని ఫిక్స్ అవ్వడమే కాదు.. ఆమె క్యారెక్టర్ ను కూడా జడ్జ్ చేసేస్తారు కొందరు. ఈ సీరియస్ పాయింట్ ను దర్శకుడు శ్రీకాంత్ చాలా సెన్సిబుల్ గా తెరకెక్కించాడు.
అమ్మాయికి 30 ఏళ్ళు అని అబ్బాయి వదిలేయడం, అబ్బాయికి 33 ఏళ్ళు అని అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోకపోవడం వంటివి మన సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే థీమ్ తో తెరకెక్కిన “భానుమతి & రామకృష్ణ”లో ఫీల్ ఉన్నప్పటికీ.. ఎమోషనల్ గా ఆడియన్స్ ను కనెక్ట్ చేసే సందర్భాలు, సన్నివేశాలు లేకపోవడం పెద్ద మైనస్. రామకృష్ణ బాధ, భానుమతి అహం అర్ధమవుతున్నప్పటికీ.. వాటికి ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వలేడు, ఓన్ చేసుకొనే స్థాయి ఎమోషన్ పండలేదు. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమాని అదనపు ఆకర్షణలుగా నిలిచాయి.
కేవలం 92 నిమిషాల ఈ వెబ్ ఫిలింకి మరో 10 నిమిషాలు జోడించి భానుమతి-రామకృష్ణల నడుమ కెమిస్ట్రీని ఇంకాస్త ఎలివేట్ చేసి ఉంటే వారి కలయికను ప్రేక్షకులు కూడా ఆస్వాదించేవారు. కానీ.. అప్పటివరకూ సాగిన కథా గమనం ఒక్కసారిగా అధర చుంభనంతో సింపుల్ గా ముగియడంతో ప్రోపర్ ఎండ్ & ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండాపోయాయి.
విశ్లేషణ: రెగ్యులర్ లవ్ స్టోరీలు చూసి బోర్ కొట్టేసిన ఆడియన్స్ సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ చిత్రం “భానుమతి & రామకృష్ణ”. రామకృష్ణ మంచితనం, భానుమతి మొండితనం, బంటి బాబు పెంకితనం, శ్రీకాంత్ పనితనం తప్పకుండా ఆకట్టుకుంటాయి.