Tollywood: టాలీవుడ్లో పెద్ద సినిమాలు అప్పటివరకు కష్టమేనా?
January 30, 2022 / 01:09 PM IST
|Follow Us
టాలీవుడ్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏది అంటే… కరోనా పరిస్థితులే అని చెప్పాలి. ప్రశాంతంగా సినిమా చిత్రీకరణ జరుపుకోలేరు. గ్రాండ్గా ప్రచారం చేసుకోలేరు. భారీగా రిలీజ్ చేసి వసూళ్లు సాధించలేరు. అయితే ఇదంతా తెలంగాణలో ఉన్న సమస్యలు. ఆంధ్రప్రదేశ్లో అయితే కరోనాతోపాటు ఇంకొక సమస్య కూడా ఉంది. అదే సినిమా టికెట్ రేట్లు. అవును ఏళ్ల క్రితం నాటి ధరల పట్టిక బయటకు తీసుకొచ్చి దాన్నే అమలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతోంది.
ఈ సమస్యను క్లోజ్ చేయడానికి పరిశ్రమ వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు… ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. కమిటీలు వేసి భేటీలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఏమీ తేలడం లేదు. దీంతో పెద్ద సినిమా నిర్మాతలు తేలు కుట్టిన దొంగల్లాగా గమ్మున ఉండాల్సి వస్తోంది. అయితే రేపో మాపో ఈ సమస్య తేలిపోతుంది అని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కొత్త సినిమాలు కూడా షూటింగ్ ఆ ఆలోచనతోనే చేస్తున్నాయి. అయితే ఏపీలో టికెట్ల సమస్య ఇప్పట్లో తేలదా? నిర్మాత దిల్ రాజు మాటలు వింటుంటే అలానే ఉంది.
‘‘ఈ సమ్మర్లోనే పెద్ద సినిమాలన్నీ విడుదలవుతాయి. ఈలోపు ఏపీలో టికెట్ ధరల సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది’’ అని చెప్పారు దిల్ రాజు. అయితే ఫిబ్రవరి నెలాఖరు నుంచి పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని కూడా చెప్పారు. సినిమా విడుదల తేదీల విషయంలో నిర్మాతలం మాట్లాడుకుని.. ఓ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు దిల్ రాజు. ఆయన మాటల్లో టికెట్ల ధరల సమస్య తేలుతుందని ఆశాభావం కనిపిస్తోంది.
అయితే పెద్ద సినిమాలు మార్చి, ఏప్రిల్లోనే అనే భావన కూడా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు ఏవీ రావు. వచ్చినా డబ్బులు సంపాదించలేవు. ఇప్పటికే ‘ఆచార్య’ వెనక్కి వెళ్లిపోయింది. రవితేజ ‘ఖిలాడీ’ రెడీగా ఉంది. మరి సినిమా డేర్ చేసి రిలీజ్ చేస్తారా? లేక వెనక్కి వెళ్తారా అనేది చూడాలి. రెండో నెల ఆఖరిలో రావాల్సిన ‘భీమ్లా నాయక్’ నుండి అయితే ఎలాంటి ముచ్చట లేదు. సినిమా వాయిదా పక్కా అంటున్నారు. కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.